గ్రీన్ ఫీల్డ్ హైవే మాటున బ్లాక్ దందా… అడ్డుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

దిశ దశ, హుజురాబాద్:

 

యాష్ లారీల తీరుపై ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు వెల్లువెత్తినా తాత్కాలికంగా రవాణా నిలిపివేసిన అధికారులు తిరిగి యథావిధిగా నడిపిస్తున్నారు.

రామగుండం టు…

రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాష్ ప్లాంట్ నుండి ఖమ్మం జిల్లా మీదుగా నిర్మాణం అవుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం బూడిద రవాణా చేస్తున్నారు. ఇందుకోసం ఎన్టీపీసీ కొన్ని ఏజెన్సీలకు యాష్ సరఫరా చేసేందుకు అనుమతించింది. అయితే లారీల సామర్థ్యానికి మించి యాష్ ప్లాంట్ నుండి బూడిదను రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. గతంలో వరంగల్ సమీపంలోని వర్దన్నపేట వద్ద కూడా లారీలను స్థానికులు ఆపి ఆందోళన చేశారు. ఓవర్ లోడ్ తో వెల్తున్న లారీల కారణంగా వర్దన్నపేట హైవేకు ఇరువైపులా ఉన్న నివాసాల్లో బూడిద పడుతోందని నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం కట్టడి చర్యలు తీసుకోకపోగా లోకసభ ఎన్నికలకు ముందు మాత్రం కొద్ది రోజుల పాటు యాష్ తరలించే లారీలను నిలిపివేశారు. తిరిగి ఎన్టీపీసీ నుండి ఖమ్మంవరకు ఓవర్ లోడ్ తో యాష్ ను తరలిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవర్ లోడ్ కు ఎలా అనుమతిస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే హైవే నిర్మాణం కోసం రవాణా అవుతున్న ఈ యాష్ కు కాంట్రాక్టర్ బిల్లులను తూకం వేసి చెల్లిస్తారని చెప్తున్నారు. లారీల్లో ఎంత క్వాంటిటీ యాష్ చేరితే అంతకు బిల్లులు ఇస్తుండడం… ఇందుకు ఎన్టీపీసీ అధికారులు కూడా యాష్ ప్లాంట్ నుండి బూడిద తరలించేందుకు అనుమతిస్తుండడం విడ్డూరంగా మారింది. ప్రభుత్వం విధించిన నిభందనలనే ప్రభుత్వ శాఖలు తుంగలో తొక్కుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

అడ్డుకున్న ఎమ్మెల్యే…

ఓవర్ లోడ్ తో వెల్తున్న బూడిద లారీలను శనివారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. వే బిల్లులు లేకుండా కూడా యాష్ లారీలు వెల్తున్నాయని ఆయన ఆరోపించారు. ఓ లారిని నిలిపి మరీ తనిఖీ చేసిన ఎమ్మెల్యే నిబంధనలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మీదుగా నిర్మాణం అవుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తరలిస్తున్న లారీలు రోజుకు 300 వరకూ వెల్తున్నాయని కౌశిక్ రెడ్డి వివరించారు. ఈ వ్యవహారంతో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కు సంబంధం ఉందని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఓవర్ లోడ్ వ్యవహారం నడుపుతున్న వారి నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ కు రోజుకు రూ. 50 లక్షలు ముడుతున్నాయని ఆరోపించారు. ప్రత్యక్ష్యంగా తాను ఈ అక్రమాలను నిరూపించినందున మంత్రి పొన్నంను వెంటనే బర్తరఫ్ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.


You cannot copy content of this page