Mla padi kaushik reddy: అక్కడ అరెస్ట్… ఇక్కడ రెస్ట్…

మంగళవారం కోర్టు ముందుకు…

దిశ దశ, కరీంనగర్:

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తరలించిన తరువాత ప్రత్యేక ఏర్పాట్లు చేసి రెస్ట్ కోసం ఏర్పాట్లు చేశారు పోలీసులు. సోమవారం రాత్రి 10.30 గంటలకు కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి తీసుకెళ్లిన పోలీసులు అర్థరాత్రి దాటిన తరువాత కరీంనగర్ త్రీ టౌన్ కు తరలించారు. అక్కడ ప్రత్యేకంగా బెడ్ కూడా తెప్పించి ఆయనకు రెస్ట్ తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు వైద్యుల బృందాన్ని కూడా రప్పించారు. దీంతో అర్థరాత్రే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని భావించినప్పటికీ అనూహ్యంగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు పోలీసులు. కౌశిక్ రెడ్డిపై వన్ టౌన్ లో క్రిమినల్ కేసులు నమోదు కావడంతో ఆయనను అక్కడికే తీసుకవస్తారని భావించిన టీఆర్ఎస్ శ్రేణులు, న్యాయవాదుల బృందం అక్కడకు చేరుకుంది. అర్థరాత్రి అయినా కౌశిక్ రెడ్డిని వన్ టౌన్ వద్దకు తీసుకరాకపోవడంతో అడ్వకేట్, బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ రవిందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిని తప్పు పడుతూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో రవిందర్ సింగ్ ను కరీంనగర్ త్రీ టౌన్ కు తీసుకెళ్లి కౌశిక్ రెడ్డిని చూపించారు. అప్పుడే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టుగా రవిందర్ సింగ్ కు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులో మాత్రం క్రైం నంబర్ 30/2025లో మాత్రమే అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన రివ్యూ సమావేశానికి సంబంధించిన ఘటనలపై మొత్తం మూడు కేసులు నమోదు అయినప్పటికీ ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేస్తున్నామని అందులో పేర్కొన్నారు.


మంగళవారం ఉదయం…

మంగళవారం ఉదయం కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు మరోసారి  వైద్యం బృందం చేరుకుంది. ఆయనకు పరీక్షలు నిర్వహించిన అనంతరం బ్రేక్ ఫాస్ట్ చేయించిన పోలీసులు కరీంనగర్ కోర్టుకు తరలించారు. అప్పటికే జ్యుడిషియరీ అధికారులకు సమాచారం అందించడంతో ఆయనను నేరుగా మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళారు. అప్పటికే కౌశిక్ రెడ్డి తరుపున అడ్వకేట్లు కోర్టు ఆవరణకు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఎఫ్ఐర్ కాపీ, రిమాండ్ సీడీని స్టడీ చేసిన అడ్వకేట్లు మెజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించారు.



వెతకబోయే తీగ…

అయితే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో కరీంనగర్ పోలీసులకు వెతకబోయే తీగ కాలికి తగిలినట్టయిందని తెలుస్తోంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆయనను అరెస్ట్ చేసేందుకు కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, టూటౌన్ సీఐ సృజన్ రెడ్డిలు పోలీసు బలగాలను తీసుకుని వెళ్లారు. హైదరాబాద్ నగరంలో ఆయనను ఎక్కడ అదుపులోకి తీసుకోవాలి, ఏ ప్రాంతంలో ఉంటాడు, ఆయన ఉండే నివాసం గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అక్కడి సెక్యూరిటీని ఎలా అధిగమించాలి అన్న విషయాలపై సమాలోచనలు జరుపుతున్న క్రమంలో సాయంత్రం హైదరాబాద్ వెల్లిన పోలీసు బృందాలకు అందిన సమాచారం తీపి కబురునే అందించింది. ఓ టీవీ ఛానెల్ లో లైవ్ డిబేట్ లో పాల్గొనేందుకు వెల్తున్నాడన్న విషయం తెలియగానే కరీంనగర్ నుండి హైదరాబాద్ వెల్లిన పోలీసు బృందాలు జూబ్లిహిల్స్ లోని సదరు మీడియా చానెల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కాపు కాశారు. లైవ్ డిబేట్ ముగిసిన తరువాత బయటకు వస్తున్న కౌశిక్ రెడ్డిని ఏసీపీ వెంకటస్వామి, సృజన్ రెడ్డిలు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ తరలించారు.

You cannot copy content of this page