సర్కారు పాఠశాల స్టూడెంట్స్ కోసం అల్పాహారం… స్నాక్స్…

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరో నిర్ణయం

దిశ దశ, చొప్పదండి:

సర్కారు బడిలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు ఆ ఎమ్మెల్యే… ప్రభుత్వ విద్య అందుకుంటున్న విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యలో రాణించాలంటే విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గమనించారు. ఇందులో భాగంగా ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందించేందుకు ముందుకు వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం  పాఠశాలలను సెమి రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చి విద్యార్థులు చదువుల్లో రాణించే విధంగా చొరవ తీసుకోవాలన్న ప్రతిపాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమ్మెల్యే మాత్రం ముందుగానే తన నియోజకవర్గంలోని పాఠశాలలను సెమి రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చేందుకు చొరవ తీసుకున్నారు. 

చొప్పదండిలో…

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు తనదైన రీతిలో సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వినూత్న నిర్ణయాలు తీసుకుని ఆధర్శంగా నిలిచిన ఆయన తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం, స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావించారు. పదో తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో 200కు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ ను అందించాలని నిర్ణయించారు. బుధవారం గంగాధర మండలం గర్షకుర్తి పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులు మెరిట్ సాధించినట్టయితే ఇంటర్మీడియెట్ లో వారికి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా టాపర్స్ కు ట్రిపుల్ ఐటీల్లో కూడా సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. పదో తరగతిలో  పదికి పది జీపీఏ సాధించడమే లక్ష్యంగా అదనపు క్లాసులు నిర్వహించేందుకు ముందుకు వస్తున్నారు టీచర్లు. ఈ నేపథ్యంలో బడిలోనే ఎక్కువ సమయం కెటాయించే విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడతారని భావించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా అందించాలని నిర్ణయించారు. 200 మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు నియోజకవర్గంలోని చొప్పదండి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాల్లో సుమారు 20 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్ ఇవ్వనున్నారు. 

వైవిద్యమైన ఆలోచనలు..

ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేతగా ఎదిగిన మేడిపల్లి సత్యం చొప్పదండిలో తన మార్కు పరిపాలన అందించేందుకు చొరవ తీసుకుంటున్నారు. రూ. 10 లక్షలలోపు నిధులతో చేపట్టే అభివృద్ది పనులకు శిలా ఫలకాలు వేయకూడదని నిర్ణయించుకున్నారు. అలాగే ఇటీవల తన జన్మదినం సందర్భంగా బొకెలు, శాలువాలు ఇవ్వొద్దని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం నోట్ బుక్స్ ఇవ్వాలని పిలుపునిచ్చి… వాటిని సేకరించి  విద్యార్థులకు అందించారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా గత దశాబ్డ కాలంగా తన వెన్నంటి నడిచిన, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం పెనవేసుకున్న ద్వితీయ శ్రేణి నాయకులకే కీలక బాధ్యతలు ఇస్తానని ఖరాకండిగా చెప్పేశారు. అధికార యంత్రాంగం పోస్టింగుల విషయంలో కూడా కొంత కఠినంగానే ఉంటానని తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్థిక లావాదేవీలకు తావివ్వకుండా ప్రజలకు సేవ చేసే వారు మాత్రమే తన నియోజకవర్గంలో పని చేసేందుకు ముందుకు రావాలని వెల్లడించినట్టుగా తెలిసింది. దీంతో చొప్పదండి నియోజకవర్గంలో గతంలో నెలకొన్న వాతావరణానికి భిన్నంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది.

You cannot copy content of this page