దిశ దశ, అనంతపురం:
రాష్ట్రం అంతా ఒకలా ఉంటే అక్కడ మాత్రం మరోలా ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు సాగితే ఇక్కడ మాత్రం యథావిధిగా పనులు సాగిపోయేవి. ఆ పరిస్థితికి భిన్నంగా మారిపోయిందక్కడ. నిన్నటి వరకు ఒకలా వ్యవహరించిన ఆ ప్రతినిధి ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉన్న ఆ మునిసిపాలిటీలో ఇప్పుడు జరుగుతున్న తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు క్లీన్ మునిసిపాలిటీగా రికార్డు అందుకోగా ఇప్పుడు చెత్తకు కేరాఫ్ గా నిలిచింది.
ఏ మునిసిపాలిటీ.. ఏమా కథ..?
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీ ప్రజలు వైవిద్యమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో 75 మునిసిపాలిటీల్లో 74 మునిసిపాలిటీలు అధికార వైసీపీ గెల్చుకుంటే ఒక్క తాడిపత్రిని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఎన్నికల సమయంలో మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తనదే బాధ్యత అంటూ భరోసా ఇస్తూ… చిత్తు కాగితం కనిపించకుండా పరిశుభ్రమైన పట్టణంగా ఉంచుతానంటూ ప్రకటనలు కురిపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన హామీలను విశ్వసించిన తాడిపత్రి ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. అధికారం చేజిక్కిన తరువాత కూడా అదే పద్దతిన ముందుకు సాగిన జేసీ ప్రభాకర్ రెడ్డి చర్యలతో తాడిపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అవార్డులు కూడా అందుకున్న తాడిపత్రి… ప్రతి పక్ష పార్టీ నేతల ప్రాతినిథ్యంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుందనే చెప్పాలి. మూడున్నర దశాబ్దాలుగా తన పట్టు నిలుపుకుంటూ వస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి బల్దియాలో పనిచేస్తున్న వారెవరైనా సరే ఆందోళనలు, సమ్మెలకు దూరంగా ఉండే విధంగా పావులు కదిపే వారు. ఇందుకు అనుగుణంగా తాడిపత్రి మునిసిపల్ యంత్రాంగం కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే నడుచుకోవడంతో క్లీన్ మునిసిపాలిటీగా చరిత్రకెక్కంది ఇంతకాలం.
ఇఫ్పుడు వైవిద్యం…
అయితే ఈ సారి మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తన కంచుకోటగా ఉన్న తాడిపత్రి మునిసిపాలిటీ విషయంలో పట్టువిడుపులగా వ్యవహరిస్తున్న తీరు అందరినీ విస్మయపరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మునిసిపల్ కార్మికులు సమ్మెబాటలో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో మాత్రం ఏనాడు సమ్మెల వైపు కన్నెత్తి చూడని తాడిపత్రి మునిసిపాలిటీ యంత్రాంగం మాత్రం ఈ సారి విధులకు దూరంగా ఉండడం విచిత్రమనే చెప్పాలి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఇక్కడి మునిసిపల్ కార్మికులు సమ్మె బాటలో సాగుతుండడం అన్ని వర్గాలను ఆశ్యర్యానికి గురి చేసింది. అంతేకాకుండా ఇంతకాలం సమ్మెలకు దూరంగా ఉండే విధంగా పావులు కదిపిన జేసీ కూడా కార్మికులను ఆ దిశగా ప్రోత్సహిస్తుండడం కూడా సరికొత్త చర్చకు దారి తీసింది. రాష్ట్రంలోనే వైవిద్యంగా నడుచుకున్న ఒకే ఒక్క మునిసిపాలిటీ ఈ సారి గుంపులో గోవిందయ్యలా రాష్ట్రంలోని ఇతర మునిసిపాలిటీల్లో సాగుతున్న విధంగానే సమ్మె చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకాలం అలాంటి చర్యలకు దూరంగా ఉండాలన్న సంకేతాలు ఇచ్చిన జేసీ ఈ సారి మాత్రం సమ్మెకు మద్దతునిస్తూ కార్మికులకు విరాళాలు కూడా అందిస్తున్న తీరు మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలను ఆశ్యర్యానికి గురి చేస్తుండగా… కార్మికులు కూడా జేసీ వ్యవహరిస్తున్న తీరుపై ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి తయారైంది.
ముందుకొచ్చిన ‘కేతిరెడ్డి’
అయితే తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పట్టడంతో మునిసిపాలిటీల్లో చెత్తా, చెదారం పేరుకపోయిన సంగతి తెలిసిందే. ఇంతకాలం పరిశుభ్రతకు మారు పేరుగా ఉన్న తాడిపత్రిలోనూ చెత్తా చెదారం పేరకపోయి దుర్గంధం వెదజల్లుతోంది. జేసీ సమ్మెకు మద్దతు ఇవ్వడంతోనే ఈ పరిస్థితి తయారైందన్న ఆవేదన పట్టణ వాసుల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల సమ్మెకు తాను వ్యతిరేకం కాదని ప్రకటించిన ఆయన ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమేనని అన్నారు. ఇందులో భాగంగా చెత్త తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టే పనిలో నిమగ్నం అయ్యారు పెద్దారెడ్డి. గురువారం ప్రత్యేకంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేయించిన ఆయన తాడిపత్రి మునిసిపాలిటీని క్లీన్ మునిసిపాలిటీ చేసేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. దీంతో మురికి కూపంగా మరబోతున్న తాడిపత్రికి గత వైభవం తీసుకొచ్చే విధంగా పెద్దారెడ్డి చొరవ తీసుకుంటుండం విశేషం. కార్మికుల లక్ష్యాలను గౌరవిస్తూనే మరో వైపున ప్రజల సంక్షేమం కూడా ముఖ్యమని గురించిన తొలి ఎమ్మెల్యే కూడా పెద్దారెడ్డే కావడం విశేషం.