మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద ప్రత్యక్ష్యమైన ఎమ్మెల్యే రాజాసింగ్..!

దిశ దశ, హైదరాబాద్:

ఎమ్మెల్యే రాజాసింగ్ అనూహ్యంగా రాష్ట్ర మంత్రి హరీష్ రావును కలిశారు. ఆయన ఇంటికి వెల్లి కొద్దిసేపు మంత్రితో ముచ్చటించిన అనంతరం వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నట్టుండి బీఆర్ఎస్ మంత్రి ఇంటి వద్ద ప్రత్యక్ష్యం కావడం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆయన ఉన్నట్టుండి మంత్రి హరీష్ ఇంటి వద్ద కనిపించడం గమనార్హం. వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ అయిన రాజాసింగ్ ను బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. బెయిలుపై బయటకు వచ్చిన తరువాత కూడా రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని రాష్ట్ర పార్టీ కూడా ప్రతిపాదనలు చేసినప్పటికీ జాతీయ పార్టీ నుండి ఎలాంటి స్పందన రావడం లేదు. తాజాగా రాజా సింగ్ మంత్రి హరీష్ రావును కలవడం వెనక కారణాలు ఏంటన్న విషయవ బయటకు రావడం లేదు కానీ ఆయన మంంత్రి హరీష్ ఇంటి నుండి బయటకు వస్తున్నప్పుడు తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. టార్గెట్ అయిన రాజాసింగ్ గతంలో తనకు కెటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం గురించి నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తనకు కెటాయించిన సెక్యూరిటీ విషయంలో మంత్రిని కలిశారా లేక అభివృద్ది పనులకు సంబంధించిన నిధుల కెటాయింపు గురించి కలిశారా అన్న విషయంపై క్లారిటీ రావడం లేదు. మరో వైపున బీజేపీ నాయకత్వం కూడా ఆయనను విస్మరించినట్టుగానే వ్యవహరిస్తుండడంతో ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా లేక అధికార పార్టీ నాయకులే ఆయన్ని పిలిపించి చర్చలు జరిపారా అన్న తర్జనభర్జనలు కూడా సాగుతున్నాయి. అయితే రాజాసింగ్ విషయంలో మాత్రం పలు వర్గాల్లో సానుకూలత అయితే ఉందన్నది వాస్తవం. ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేసిన అంశంపై ఆందోళనలు కూడా నిర్వహించారు హిందుత్వ వాదులు. కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ముద్రపడ్డి రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపే అవకాశాలు అయితే ఉండవన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుతో విసుగు చెందిన రాజాసింగ్ పార్టీకి షాక్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపిందని చెప్పకతప్పదు.

You cannot copy content of this page