ప్రజావాణిలో ప్రత్యక్షమైన ఎమ్మెల్యే

సమస్య పరిష్కారం కోసం వినతి

దిశ దశ, జగిత్యాల:

ఆయనో ఎమ్మెల్యే… అందునా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు. ఓ ఫోన్ కాల్ తో అధికారులను పరిగెత్తించే అవకాశం ఉన్నా ఆయన మాత్రం సాదా సీదాగా ప్రజావాణికి వచ్చారు. అందరి పిటిషన్లు తీసుకునే పనిలో నిమగ్నమైన అదికార యంత్రాంగం అంతా ఆయన్ని చూసి షాకయ్యారు. జగిత్యాల కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఓ ప్రజా సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లాలోని తాట్లవాయిలో గిరిజనులు, గిరిజనేతరుల భూముల కోసం… ఆయన ప్రజావాణి బాట పట్టక తప్పలేదు. గ్రామంలోని 156, 26 సర్వే నంబర్ల భూమిలో చాలాకాలంగా స్థానికులు వ్యవసాయం చేసుకుంటున్నారని వారికి పట్టాలివ్వాలని ఎమ్మెల్యే కలెక్టర్ యాస్మిన్ భాషాను అభ్యర్థించారు. ప్రభుత్వ భూములే అయినప్పటికీ స్థానికులు దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్నందున వారి పేరిట పట్టాలు ఇవ్వాలని కోరారు.

పల్లె నిద్రతో నా దృష్టికి

ప్రజా సమస్యలను గుర్తించడం, వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడం కోసం తాను నిర్వహిస్తున్న పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఇటీవల తాను తాట్లవాయి గ్రామంలో పల్లె నిద్రలో భాగంగా బస చేసినప్పుడు గ్రామస్తులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వారికి పట్టాలు ఇప్పించేందుకు తనవంతు బాధ్యత నెరవేరుస్తానని మాట ఇచ్చానన్నారు. సోమవారం గ్రామస్తులు ప్రజావాణికి వస్తున్నామని చెప్పడంతో తాను కూడా వారి వెంట రావడం జరిగిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివరించారు. తాట్లవాయి గ్రామంలో ముందు ఎజాయ్ మెంట్ సర్వే నిర్వహించాలని, ఎవరెవరు ఎంత విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారో తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ ను తెలిపారు.

You cannot copy content of this page