టికెట్ నాదేనన్న ఎమ్మెల్యే…

మంత్రి ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారన్నదే ప్రశ్న…

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

టికెట్ నాదే… మంత్రి కేటీఆర్ రెండు రోజులకోసారి మొబైల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు, సీఎం, మంత్రి మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, నేను బాధ్యతల్లో మెదులుతున్నాం మా ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయంటూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వ్యాఖ్యలు చేసిన రోజే ఆయనకు పార్టీలో ప్రత్యర్థిగా ప్రచారం జరుగుతున్న చలిమెడ లక్ష్మీ నరసింహ రావుకు మంత్రి కేటీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం సంచలనంగా మారింది. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో తన భాగస్వామ్యం ఉంటుందని ఎమ్మెల్యే ప్రకటించిన రోజే మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా చలిమెడను పిలిపించుకుని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి వీడ్కోలు చెప్పేందుకు హెలిక్యాప్టర్ లో హైదరాబాద్ కు పంపించడంతో కేటీఆర్ ఏ విధమైన సంకేతాలు ఇచ్చారోనన్న చర్చ మొదలైంది.

ఎడ మొఖం… పెడ మొఖం…

ఇప్పటికే వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు విషయంలో అధిష్టానం గుర్రుగా ఉందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండగా, చలిమెడ లక్ష్మీ నరసింహరావుకు ప్రాధాన్యత ఇచ్చే పనిలో ముఖ్య నేతలు నిమగ్నం అయ్యారని పార్ఠీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఇంత కాలం కరీంనగర్ కే పరిమితం అయిన చలిమెడ కూడా తన మకాం వేములవాడకు మార్చడం, తన స్వగ్రామమైన మల్కపేట స్కూలు రూపు రేఖలను మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మార్చడం గమనార్హం. ఈ పాఠశాల ప్రారంభోత్సవం విషయంలో కూడా ఎమ్మెల్యే రమేష్ బాబు మోకాలడ్డుతున్నారని, దీంతో మంత్రి వేములవాడ టూర్ కు రాలేకపోతున్నారని మొదట్లో ప్రచారం జరిగింది. ఆ తరువాత మంత్రి కేటీఆర్ రమేష్ బాబు వద్దని వారించినా వినకుండా మల్కపేట ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. ఆ తరువాత వేమలవాడ ఆలయ కమిటీ విషయంలో కూడా మంత్రి కేటీఆర్ ప్రతిపాదనలు ఎమ్మెల్యే రమేష్ బాబు సున్నితంగా తిరస్కరించినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ నెల 16న వేమలవాడ పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ టూర్ రద్దయినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. బుధవారం మంత్రి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నా కూడా అటువైపు ఎమ్మెల్యే రమేష్ బాబు వెల్లకుండా వేములవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన సభా వేదికపైకి మంత్రి కేటీఆర్ వేములవాడ టికెట్ ఆశిస్తున్న చలిమెడ లక్ష్మీ నరసింహరావు, ఏనుగు మనోహర్ రెడ్డిలను పిలవడం చర్చనీయాంశం అయింది. కార్యక్రమం ముగిసిన తరువాత టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సాగనంపేందుకు ఆయనతో పాటు చలిమెడను హెలిక్యాప్టర్ లో పంపించడం సరికొత్త చర్చకు దారి తీసింది. మంగళవారం వేములవాడ పట్టణంలోనే ఆయన సొంత క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం… ఈ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు బుధవారం వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించగా, పొరుగునే ఉన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ చలిమెడ లక్ష్మీ నరసింహరావుకు, ఏనుగు మనోహర్ రెడ్డిలకు ప్రయారిటీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు నెల రోజుల క్రితం సిరిసిల్లలో జరిగిన సమావేశంలో కేటీఆర్ సమక్షంలోనే మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ చెన్నమనేని మరోసారి గెలిపించాలని, వచ్చే ఎన్నికల్లో ఆయనే బరిలో నిలబడతారని ప్రకటించారు. అప్పుడు కూడా మంత్రి కేటీఆర్ వ్యతిరేకించకుండా గుంభనంగా వ్యవహరించారు. తాజాగా బుధవారం నాటి పర్యనటలో మాత్రం రమేష్ బాబుకు వ్యతిరేకంగా జట్టు కట్టిన నాయకులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం గమనార్హం.

కారణం ఇదేనా..?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలప్పటి నుండి ఈ సెగ్మెంట్ పై మంత్రి కేటి రామారావు ప్రత్యేక దృష్టి సారించినట్టుగా అర్థమవుతోంది. అప్పుడు వేములవాడకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేయడంతో ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్ వారిని ప్రగతి భవన్ కు పిలిపించుకుని అన్ని విషయాలు చర్చించారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు వేములవాడలో జరుగుతున్న పరిణామాలపై స్థానిక సంస్థల ప్రతినిధులు వివరించారు. ఆ తరువాతే కేటీఆర్ వేములవాడపై ఓ కన్నేసీ ఉంచారు. ఇదే క్రమంలో రమేష్ బాబు పౌరసత్వ వివాదం నిర్ణయాలు తీసుకునే అంశం తుది దశకు చేరుకుంది. ఏ క్షణంలో అయినా పౌరసత్వంపై కేంద్రం తేల్చినట్టయితే కొత్త అభ్యర్థి ఎంపిక హాడావుడిగా చేయాల్సి వస్తుందన్న భావనతో ముందుగానే కొత్త అభ్యర్థిని ఎంచుకునే పనిలో అధిష్టానం నిమగ్నం అయినట్టుగా అర్థమవుతోంది. అయితే చెన్నమనేని వ్యూహ ప్రతి వ్యూహాలు కూడా సీరియస్ గా నే ఉంటాయని ఇందుకు విరుగుడు ఆయన కనిపెట్టి చివరి క్షణంలో టికెట్ తెచ్చుకుంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరిగిన చివరకు రమేష్ బాబు అభ్యర్థిగా బరిలో నిలిచిన అనుభవం కూడా ఉన్నందున వేములవాడ క్యాడర్ లో మాత్రం అయోమయం నెలకొందనే చెప్పాలి. ఏది ఏమైనా బుధవారం సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యవహరించిన తీరు మాత్రం వేములవాడ వాసులను ఆశ్యర్యంలో ముంచెత్తింది.

You cannot copy content of this page