ఓటుకు నోటు అంటున్న ఎమ్మెల్సీ

ఉగాది రోజున వినూత్న ప్రచారం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి నోట ఓటుకు నోటన్న మాటలు రావడం స్థానికంగా సంచలనం కల్గిస్తోంది. అయితే ఆయన నోటి నుండి వచ్చిన ఈ మాటలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని అనలేదండోయ్… ఓటుకు నోటు కేసులో ఇరక్కున్న ఆయన గురించి మాట్లాడారనుకుంటే తప్పులే కాలేసినట్టే. ఇంతకీ ఆయన నోట వచ్చిన ఈ వ్యాఖ్యలకు కారణమేంటంటే..?

గ్రాడ్యూయేట్స్ కానిస్టెన్సీ శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం ఉగాది పర్వదినం రోజున జగిత్యాల సమీపంలోని టీఆర్ నగర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానికులతో మాటా మంతి చేస్తున్న క్రమంలో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాలనీ వాసుల్లో నవ్వులు తెప్పించాయి. వచ్చే ఎన్నికల్లో ఓటుతో పాటు నోటు కూడా తనకు ఇవ్వాలని స్థానికులను అభ్యర్థించారు. ఓటుతో పాటు నూరు రూపాయలు కూడా ఇవ్వాలని వారిని కోరుతూ ఒక్క రోజుకు తాగుడుకు పెట్టే ఖర్చు తనకు ఇవ్వాలని కోరారు. ఆయన మాటలకు ఏకీ భవించిన స్థానికులు నవ్వే సమాధానం అన్నట్టుగా వ్యవహరించారు. అయితే లిక్కర్ గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ గురించి తెలిసి కొందరు ఛలోక్తులు విసురుతున్నారు. ఏంటీ జీవన్ రెడ్డి సాబ్ కు లిక్కర్ రేట్లు కూడా తెలుస్తలేవా..? ఒక్క రోజు మందు తాగేందుకు రూ. వందే సరిపోతాయా..? ఆ డబ్బులతో క్వార్టర్ కూడా రాదు కదా అని నవ్వుకున్న వారూ లేకపోలేదు. ఓ వైపున మద్యం అమ్మకాల మీదనే తెలంగాణ సర్కర్ నడుస్తోందని విమర్శించే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాటి ధరలు ఎంత పెరిగాయే కూడా తెలియదా అని కొందరు కామెంట్ చేస్తుంటే… పెద్దాయన జీవన్ రెడ్డి సాబ్ కు మద్యం అలవాటు లేదు కావచ్చు అందుకే ధరలు కూడా తెలియడం లేదంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికల్లో తన గెలుపే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డి నిత్యం జగిత్యాల ప్రజల మధ్య ఉంటూ తన పట్టు బిగించే పనిలో నిమగ్నం అయ్యారు. టీఆర్ నగర్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడం గమనార్హం.

You cannot copy content of this page