పలు చోట్ల రచ్చ రచ్చ
దిశ దశ, కరీంనగర్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవల్సిన నామమాత్రమే అయినప్పటికీ పోలీంగ్ కేంద్రాల వద్ద మాత్రం ఆందోళనలు చోటు చేసుకోవడం విచిత్రంగా ఉంది. అతి తక్కువ మంది ఓట్లు పాల్గొనే సమయంలో కూడా పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తయారు కావడం విడ్డూరం. గురువారం కరీంనగర్ పట్ట భద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారనో, దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతోనే గొడవలు జరగడం విస్మయం కల్గిస్తోంది. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల పోలీసులు ఆందోళనకారులను నిలవురించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనే 3.55 లక్షల పట్ట భద్రుల ఓటర్లు ఉండగా, 27088 మంది టీచర్ నియోజకవర్గ ఓటర్లు ఉన్నారు. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ఓటర్ల సంఖ్యతో పోల్చుకున్నట్టయితే పది శాతం మంది కూడా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఉండదు. కానీ ప్రలోభాలు, ప్రభావాల ఎర కారణంగా కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ బూతుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం విస్మయం కల్గిస్తోంది. విద్యావంతులు మాత్రమే హాజరయ్యే ఈ ఎన్నికల్లో సాధారణ కార్యకర్తలు, నాయకులు కూడా తమవంతు పాత్ర పోషించిన తీరు సరికొత్త చర్చకు దారి తీసింది. సాధారణ ఎన్నికలు జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నగదు పంపిణీ బాజాప్తాగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఓటర్లు ఏ పరిస్థితికి వచ్చారంటే తమకు రావల్సిన డబ్బు రాలేదని, తమ హక్కులకు భంగం కల్గింది అన్న రీతిలో ఆందోళనలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్ల ధన ప్రవాహం, ప్రలోభాల పర్వం గురించి అంతర్జాతీయ స్థాయలో కూడా చర్చ జరిగింది. ఇదే పంథాలో తాజాగా జరిగిన కరీంనగర్ పట్ట భద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల పోలీంగ్ తీరు జరగడం గమనార్హం. ప్రచార పర్వం నుండి ప్రలోభాల పర్వం వరకు కూడా ఆయా రాజకీయ పార్టీలు ప్రదర్శించిన దూకుడు వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆందోళనలు చోటు చేసుకోవడం సరికొత్త చర్చకు దారి తీసింది.