మంత్రి కొప్పుల తీరుపై అభ్యంతరం
ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ఫైర్
దిశ దశ, జగిత్యాల:
మంత్రి కొప్పుల ఈశ్వర్ భార్యకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థతో కలిసి పోలీసులు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టడం వివాదస్పదంగా మారింది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జగిత్యాల పోలీసుల వ్యవహార శైలిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని, రాజకీయాలను ప్రభావితం చేసేలా పోలీసులు, రాజకీయ అనుభంద సేవా సంస్థలతో కలిసి పనిచేయడం ఆక్షేపణీయమని అన్నారు. పోలీసులు స్వతంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తే తాము స్వాగతిస్తామని, పొలిటికల్ టచ్ ఉన్న సంస్థలతో చేతులు కలిపి నిరుద్యోగులకు ఉపాధిక కల్పించేందుకు శిబిరాలు ఏర్పాటు చేయడం సరికాదన్నారు. నేడో రేపో ఎన్నికల కోడ్ అమలు కానున్న నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అధికారులు నిస్పక్షపాతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఎల్ ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, పోలీసులు సంయుక్తంగా కార్యక్రమం చేపట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే రాజకీయ నాయకులకు అనుభందంగా ఉన్న సంస్థలు పోలీసుల సహాకారంతో నిర్వహించడాన్నే తప్పుపడుతున్నామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి యంత్రాంగం తప్పు చేస్తే గాడిలో పెట్టాల్సిన జిల్లా స్థాయి అధికారులే తప్పు చేస్తే ఎలా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని, త్వరలో మరో ఎపిసోడ్ కూడా విడుదల చేస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లురీ లక్ష్మణ్ కుమారు,పిసిసి సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, గాజంగి నందయ్య, కల్లే పల్లిదుర్గయ్య, గాజుల రాజేందర్, మన్సూర్, నేహాల్, చందా రాధాకిషన్, దరా రమేష్ బాబు, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, బొల్లి శేఖర్, రఘువీర్ గౌడ్ మామిడిపల్లి మహిపాల్, బిరం రాజేష్, పాల్గొన్నారు.