పొన్నం కాంగ్రెస్ వీడడు…
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్
దిశ దశ, జగిత్యాల:
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ఇతర పార్టీల వైపు ముఖ్య నాయకులు చూస్తున్నారన్న ప్రచారం గురించి ఆయన మీడియాతో ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందట కదా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జీవన్ రెడ్డి అలా అని టాక్ అయితే ఉందంటు సమాధానం ఇచ్చారు. అలాగే పొన్నం ప్రభాకర్ విషయంలో మాత్రం ఆయన పార్టీ వీడే ప్రసక్తే లేదని, ఇందులోనే కొనసాగుతారని కుండబద్దలు కొట్టారు. వ్యక్తిగతంగా కూడా తనకు పొన్నం ప్రభాకర్ గురించి తెలుసని వ్యాఖ్యానించిన ఎమ్మెల్సీ ఆయన మరో పార్టీవైపు చూసే ప్రసక్తే లేదన్న రీతిలో స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రావు కూడా పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్న ప్రచారం గురించి స్పందించిన ఆయన భట్టి విక్రమార్కను ఇదే విషయంలో అడిగానని అలాంటిదేమీ లేదని, తనకు తెలియకుండా ప్రేమ్ సాగర్ రావు పార్టీ వీడరని చెప్పారన్నారు. మీరు ఎంపీగా వెల్లే అవకాశం ఉందని అంటున్నారు కదా అన్న మరో ప్రశ్నకు బదులిచ్చిన ఆయన తనకు పొన్నం ప్రభాకర్ కు పోటీ లేదని, ఒకటేంటి రెండు నియోజకవర్గాలు అందుబాటులో ఉన్నాయని తాను పోటీ చేయాలనుకుంటే తనకు ఎవరూ అడ్డు కాదన్నారు. అధిష్టానం ఆధేశిస్తే కరీంనగర్, నిజామాబాద్ ల నుండి ఎక్కడి నుండైనా పోటీ చేస్తానన్నారు. నామినేషన్ వేసే వరకూ తాను చూసుకుంటానని ఆ తరువాత తన క్యాడర్ చూసుకుంటుందన్నారు. ఓటుకు నోటు అనే నినాదం తాను ఇప్పటికే ఇచ్చానని తనకు ఓటు వేసి రూ. 100 ఇవ్వాలని ఇప్పటికే అభ్యర్థించానని జీవన్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.