రాజధాని పర్యటనతో రాజీకొచ్చిన జీవన్ రెడ్డి…

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటి అయిన తరువాత తెలంగాణ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి రాజీ పడినట్టుగా స్పష్టం అవుతోంది. మూడు రోజులుగా అధిష్టానం నిర్ణయంపై కినుక వహించిన ఆయన ఎట్టకేలకు బెట్టు వీడారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ ఇంఛార్జి దీప్ దాస్ మున్షిలతో వేర్వేరుగా భేటీ అయిన జీవన్ రెడ్డి తన పంథాన్ని వీడారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… కార్యకర్తలను కాపాడుకోవడం చాల ముఖ్యమన్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం సముచితమైన చర్య అని వ్యాఖ్యానించారు. మారుతున్న రాజకీయ పరిణామాలు, పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తప్పవని, మొదటి నుండి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత, గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని వెల్లడించారు. లోకసభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడం… ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియామకం కావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న కాలంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందన్న ఆయన బీఆర్ఎస్ హయాంలో రుణ మాఫీ పూర్తి స్థాయిలో చేయలేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏక కాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ చేయడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ అమలు కాని పథకాలు తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని వ్యాఖ్యానించారు.

జీవన్ రెడ్డి అంటే గౌరవం: దీప్ దాస్ మున్షి…

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి అంటే ఎంతో గౌరవమని, సీనియర్ నేత అయిన ఆయనను కించపర్చే ఉద్ధేశ్యం తమకు లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి దీప్ దాస్ మున్షి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరికతో జీవన్ రెడ్డి అగౌరవంగా, అమర్యాదగా భావించారన్నారు. పార్టీలో చేరే వారికి డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, పార్టీ సీనియర్లకు ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుంటామని ప్రకటించారు. పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించిన దీప్ దాస్ కెసి వేణుగోపాల్ తో చర్చలు జరిపిన తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు.

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయ్: శ్రీధర్ బాబు…

పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న తీరుపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్న ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని చేసిన ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ గమనించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోందని శ్రీధర్ బాబు కామెంట్ చేశారు. 

You cannot copy content of this page