దిశ దశ, జగిత్యాల:
సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో అభిమానులతో చర్చలు జరిపిన ఆయన అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం మద్యాహ్నం మీడియా ముందుకు రానున్న ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డితో సహ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం పెనవేసుకున్న జీవన్ రెడ్డితో చర్చించకుండానే సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఉదయం నుండి జీవన్ రెడ్డి అభిమానులు ఆయన ఇంటికి చేరుకుని అధిష్టానం నిర్ణయంపై చర్చించారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం రాత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా జగిత్యాలకు చేరుకుని జీవన్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. తెలంగాణ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డిని సంప్రదించకుంగా అధిష్టానం నిర్ణయం తీసుకుందన్న విషయంపై కినుక వహించారన్న విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. పార్టీకి పెద్దన్నలా ఉన్న జీవన్ రెడ్డి సేవలు ఎంతో అవసరమని కూడా అభిప్రాయపడ్డ శ్రీధర్ బాబు ఆయన మదిలో మాటను పార్టీ జాతీయ నాయకులకు కూడా వివరిస్తానన్నారు. జీవన్ రెడ్డికి, శ్రీధర్ బాబుకు ఉన్న సాన్నిహిత్యం ఫలిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నాయకులు అంచనా వేసుకున్నప్పటికీ వారి అంచనాలు తలకిందులు అయినట్టుగానే కనిపిస్తోంది. శ్రీధర్ బాబుతో సుతిమెత్తగానే తన అభిప్రాయాన్ని వెల్లడించిన జీవన్ రెడ్డి… గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఇబ్బందులను తట్టుకున్నారని, కేసులు కూడా ఎదుర్కొన్న సందర్బాలు ఉన్నాయని… అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సంజయ్ ని చేర్పించుకోవడం సమంజసం కాదని అన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ క్యాడర్ పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అయినా క్షేత్ర స్థాయిలో చర్చలు జరిపిన తరువాత నిర్ణయం తీసుకుంటే బావుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. శ్రీధర్ బాబు హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయిన తరువాత జీవన్ రెడ్డి తన సన్నిహితులతో చర్చించి రాజధానికి పయనం అయ్యారు.
రాజీనామా..?
అయితే నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న తనను కాదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకున్న విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్న జీవన్ రెడ్డి మంగళవారం మద్యాహ్నం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తానిక ఎమ్మెల్సీగా కొనసాగనని పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడతానని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అధిష్టానం మెప్పించి ఒప్పించే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గవద్దని భావిస్తున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. దీంతో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెల్తుంది..? ఆయనను సముదాయించేందుకు ఎలాంటి చొరవ తీసుకుంటుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అయితే రానున్న కాలంలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే ప్రాధాన్యత దక్కితే ఇంతకాలం పార్టీలో కొనసాగిన వారి భవిష్యత్తు ఏమిటన్న అంశాన్నే జీవన్ రెడ్డి అధిష్టానం పెద్దల ముందు ఉంచే అవకాశాలు ఉన్నాయి. సంజయ్ తో కలిసి జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ కలిసి పనిచేసేందుకు సముఖంగా లేదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టనున్నారని తెలుస్తోంది.
శ్రేణుల పయనం…
సోమవారం అర్థరాత్రి తమ నేత హైదరాబాద్ కు వెల్లిన నేపథ్యంలో జగిత్యాలలోని సీనియర్ కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రాజధానికి బయలు దేరారు. మంగళవారం ఉదయం ప్రత్యేక వాహనాల్లో వెల్లిన పార్టీ శ్రేణులో అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. జీవన్ రెడ్డి నిర్ణయానికి అనుకూలంగా తామంతా ఉంటామని స్పష్టం చేసేందుకే జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ హైదరాబాద్ తరలి వెల్తోంది. దీంతో జగిత్యాలలో నెలకొన్న అనూహ్య పరిణామాలు రాజధాని కేంద్రీకృతంగా సాగే అవకాశాలు ఉన్నాయి.