ఎమ్మెల్సీ కవిత వ్యూహాత్మక ఎత్తులు…
లోకసభ ఎన్నికలే లక్ష్యమా..?
దిశ దశ, నిజామాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారా..? లోకసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై పైచేయి సాధించే దిశగా ముందుకు సాగుతున్నారా..? అంటే అవుననే విధంగానే ఉన్నాయి ఆమె పర్యటనల తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలకే పరిమితం కావల్సిన కవిత లోకసభ పరిధిలోని మెజార్టీ సెగ్మెంట్లలో క్యాంపెయిన్ నిర్వహిస్తుండడమే ఇందుకు కారణం.
ఆ ఎన్నికలే లక్ష్యంగా…
వచ్చే ఏడాది జరగనున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో తన పట్టు బిగించే ప్రయత్నాల్లో మునిగిపోయినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదపాల్సి ఉంది. ఈ రెండు చోట్ల కూడా కవిత ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారని బీఆర్ఎస్ వర్గాలు ప్రకటించాయి. అయితే ఆమె మాత్రం లోకసభ పరిధిలోని దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ కలియతిరుగతూ పార్టీ అభ్యర్థుల గెలుపులో భాగస్వాములు అవుతున్నారు.
టార్గెట్ అదేనా..?
అయితే కవిత ఎత్తుల వెనక భారీ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో కవితను ఓడించిన సంగతి తెలిసిందే. అరవింద్ ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఆయన ఓటమి కోసం పావులు కదపడం ఆరంభించారు కవిత. ఎమ్మెల్యేగా అరవింద్ ఓటమి చెందినట్టయితే తన ప్రత్యర్థిని రాజకీయంగా మట్టుబెట్టినట్టు అవుతుందని అంచనా వేసే అవకాశాలకు తోడు, తన ఫ్యామిలీకి అతి సన్నిహితుడిగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి బాసట ఇచ్చినట్టవుతుందని అనుకుంటున్నట్టుగా ఉంది. తన తండ్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నప్పుడు వెంటనే చికిత్స అందించడంతో పాటు అన్న కేటీఆర్ కు కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా భావిస్తున్నారు. అయితే కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ పైచేయిగా నిలిచినట్టయితే తన వ్యూహం ఫలించినట్టు అవుతుందని కూడా అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సీనియర్ నేతపై పట్టు కోసం…
మరో వైపున జగిత్యాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి జీవన్ రెడ్డిని మరోసారి ఓడించాలన్న లక్ష్యంతో కవిత ఇక్కడ కూడా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి బరిలో నిలిపడంలో కీలక పాత్ర పోషించిన కవిత మరోసారి ఆయన గెలుపునకు పట్టుబడుతున్నారు. దీనివల్ల గత లోకసభ ఎన్నికల్లో తన ఓటమికి కారకుల్లో ఒకరైన జీవన్ రెడ్డిపై మరోసారి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుందని భావిస్తున్నట్టుగా ఉంది.
రెండు చోట్లా…
జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా తన ప్రత్యర్ధులు కావడంతో వారిని ప్రజాక్షేత్రంలో ఓడించినట్టయితే అన్నింటా తనదే పై చేయి అవుందన్న ఆలోచనతోనే కవిత పావులు కదుపుతున్నారన్న చర్చ సాగుతోంది.
భవిష్యత్తు వ్యూహం కూడా…
మరో వైపున కవిత లోకసభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి గెలవాలన్న సంకల్పంతోనే అసెంబ్లీ ఎన్నికలను ఆసరాగా చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవంత్సరం జరగనున్న లోకసభ ఎన్నికల్లో అరవింద్ ను ఓడించాలంటే గ్రౌండ్ లెవల్ క్యాడర్ ను బలంగా తయారు చేసుకునేందుకు కూడా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కవిత అనుకూలంగా మల్చుకునే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో కవిత వ్యూహాలు ఎంతమేర పనిచేస్తాయి… ఎన్ని చోట్ల గులాభి జెండా రెపరెపలాడుతోంది అన్న విషయం తేలాలంటే మాత్రం మరో 15 రోజులు ఆగాల్సిందే.