ఢిల్లీకి చేరుకున్న మంత్రుల బృందం
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి హాజరు కానున్నారు. గురువారం జరగనున్న రెండో విడుత విచారణకు ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి 11 గంటలకు వెల్లనున్నారు. విచారణ జరపకుండా స్టే ఇవ్వాలని కోరుతూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ నిరాకరించడంతో ఆమె హాజరు కావల్సి ఉంటుంది. అయితే ఈ నెల 11 న తొలిసారి విచారణ జరిగినప్పుడే ఈడీ కవితకు నోటీసులు జారీ చేసి 16న రెండో విడుత విచారణకు రావాలని కోరింది. దీంతో గురువారం నాడు మరోసారి కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
ఢిల్లీకి చేరిన కేబినెట్ టీం
ఎమ్మెల్సీ కవితను ఈడీ మరో సారి విచారించనున్న నేపథ్యంలో ఆమెకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ మంత్రులు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. మహిళా బిల్లు సందర్భంగా బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో కవిత ఉదయమే ఢిల్లీకి వెల్లగా రాష్ట్ర మంత్రులు సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు కేటిఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు ఢిల్లీకి వెల్లారు. రాష్ట్రంలోని మరికొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఢిల్లీకి చేరుకున్నట్టు సమాచారం.
ఏఏ అంశాలపై..?
ఎమ్మెల్సీ కవితను పిళ్లైతో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన మిగతా వారి నేరాంగీకార వాంగ్మూలాలు (కన్ఫెషన్ స్టేట్ మెంట్) ఆధారం చేసుకుని కవితను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ల ఆధారంతో కూడా ఆమెను విచారించనున్నారని తెలుస్తోంది. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆమె పాత్ర ఎంత..? సౌత్ గ్రూప్ లావాదేవీల వ్యవహారంపై ఏం జరిగింది.? అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి కవితకు ఎలా పరిచయం అయింది తదితర అంశాలపై కులంకశంగా ఈడీ విచారించనున్నట్టు సమాచారం.
అరెస్ట్ చేస్తారా..?
అయితే కవితను గురువారం అరెస్ట్ చేస్తారేమోనన్న ప్రచారం కూడా విస్తృతంగానే సాగుతోంది. ఈ సారి ఈడీ విచారించిన తరువాత అరెస్ట్ నోటీసు ఇచ్చి కస్టడీలోకి తీసుకుంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపున ఈడీ విచారణపై ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెల్లడంతో కోర్టు 24న విచారణను వాయిదా వేసింది. విచారణపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం పిటిషన్ ను మాత్రం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం పక్కా కవితను అరెస్ట్ చేస్తారన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.