మోదీ సర్కార్‌కు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు

అదానీ కంపెనీల్లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల పైసలతో ఆటలా? అని ప్రశ్నించారు. ఎల్ఐసీ పెట్టుబడులు ఆవిరవుతుంటే కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. సీబీఐ, ఈడీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా మౌనం? అని ధ్వజమెత్తారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఎంతవరకు సమంజసం అని కవిత వ్యాఖ్యానించారు.

ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన ప్రజలకు కేంద్రం ఏం సమాధానం చెబుతుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టపోయాయని తెలిపారు. అయినా సీబీఐ, ఈడీ, రిజర్వ్ బ్యాంకు వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని నిలదీశారు. ఆ సంస్థలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటారా అని మండిపడ్డారు.

అమెరికాకు చెందిన హిడెన్‌బర్గ్ రిసెర్చ్‌ రిపోర్ట్‌ బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. దీనిపై కేంద్రం స్పందించి.. జేపీసీ ఏర్పాటు చేసి ఉంటే ప్రజలు నష్టపోయేవారు కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని కోరారు. కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. హిడెన్‌బర్గ్ రిసెర్చ్ ఆరోపణలు చేసిన తర్వాత అదానీ గ్రూప్‌ వాటాలు భారీగా పతనమైన విషయం తెలిసిందే. అదానీ సంస్థకు చెందిన 10 కంపెనీలు దాదాపు రూ.8.5 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయాయి. అదానీ గ్రూప్‌ అంశంపై సెబీ చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు.

You cannot copy content of this page