సీబీఐకి ఎమ్మెల్సీ కవిత ట్విస్ట్
నిజామాబాద్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత సిబిఐ అధికారులకు ట్విస్ట్ ఇచ్చారు. మొదట ఈ నెల 6న విచారణకు రావాలని సీబీఐ అధికారులు కోరగానే తన నివాసానికి వచ్చి వివరాలు తెలుసుకోవచ్చని కవిత రిప్లై ఇచ్చారు. అయితే తాజాగా కవిత పంపిన లేక చర్చనీయాంశంగా మారింది. తాను ఈ నెల 6న అందుబాటులో ఉండనని ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ బిజీ దృష్ట్యా 6వ తేదిన చేపట్టే విచారణకు అటెండ్ కాలేనని సిబిఐ అధికారులకు స్పష్టం చేశారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో అయితే తాను అందుబాటులో ఉండగలనని కవిత వెల్లడించారు.
అందులో నా పేరు లేదు
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ క్షుణ్ణంగా పరిశీలించానని పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు ఎక్కడా లేదని ఆ లేఖలో వివరించారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదుతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని ఇప్పటికే కవిత లేఖ రాయగా ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉందని సీబీఐ పేర్కొనడంతో ఈ మేరకు పూర్తి వివరాలను పరిశీలించానని కవిత వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు రాసిన లేఖలో ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని గౌరవించి దర్యాప్తునకు సహకరిస్తానని కవిత వెల్లడించారు. తాను చెప్పిన రోజుల్లో తన నివాసానికి వచ్చి వివరాలు తెలుకోవచ్చన్నారు. వాస్తవంగా మంగళవారం కవిత ఇంటికి సిబిఐ అధికారులు రావాల్సి ఉంది. అయితే సోమవారం కవిత ఇచ్చిన ట్విస్ట్ తో సిబిఐ అధికారులు ఎలా ప్రతిస్పందిస్తారో వేచి చూడాలి.