దిశ దశ, న్యూఢిల్లీ:
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీ లెండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు వారం రోజుల పాటు కోర్టు అనుమతించింది. శుక్రవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఉన్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. శనివారం కోర్టులో హాజరు పర్చిన సందర్భంగా కవిత తరుపు న్యాయవాదులు, ఈడీ వాదనలను విన్న కోర్టు సాయంత్రం వరకు ఆదేశాలను రిజర్వూలో ఉంచింది. తిరిగి సాయంత్రం కోర్టు కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ ఎన్నికల సమయంలో రూ. 100 కోట్లు హవాలా మార్గం ద్వారా తరలించిన విషయంపై ఈడీ అధికారులు కవితను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇద్దరు అప్రూవర్ గా మారి ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలం సరితూగినట్టుగా సమాచారం. దీంతో వంద కోట్ల లావాదేవీల గురించి ప్రధానంగా ఆరా తీయనున్నట్టుగా తెలుస్తోంది. మరో వైపున గత సంవత్సరం ఈడీ అధికారులు కవితను విచారించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కవిత కొన్ని మొబైల్స్ ను ఈడీకి అప్పగించింది. అంతకుముందు ఈ కేసులో కవిత వినియోగించిన ఫోన్లను ధ్వంసం చేశారంటూ ఈడీ కోర్టుకు నివేదించింది. అయితే విచారణ సమయంలో కవిత మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించిన తరువాత రిట్రైవ్ చేసి పూర్తి డాటా సేకరించినట్టు సమాచారం. ఈ మొబైల్స్ ఛాటింగ్ తో పాటు వివిధ యాప్స్ ద్వారా మాట్లాడిన కాల్స్ డిటెయిల్స్ కూడా ఈడీ సేకరించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు లిక్కర్ స్కాంకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న సమావేశాలకు సంబంధించిన టవర్ లోకేషన్స్ తో పాటు టెక్నాలజీ ఆధారంగా పలు ఆధారాలను సేకరించిన ఈడీ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నట్టుగా సమాచారం.
dishadasha
1232 posts
Prev Post