ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు. ప్రజాగోస, బీజేపీ భరోసా పేరిట హైదరాబాద్ వినయ్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో అర్వింద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. కొన్ని రోజుల్లో కవిత తీహార్ జైలుకు వెళ్తుందని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందని.. అందులో భాగంగా మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారని వెల్లడించారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు విపక్షాలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను చేస్తోందని మండిపడ్డారు. ప్రజాబలం లేక.. అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో, అక్కడి పార్టీలను బలహీనపరుస్తోందని విమర్శించారు.
ఈ క్రమంలోనే సిసోడియాను అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. ఢిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడాన్ని తట్టుకోలేకే మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారని తెలిపారు. ఇప్పటికే దేశంలోని తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీనేనని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయంగా అమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేకే సిసోడియాను అరెస్ట్ చేశారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఎంత నీచంగా వ్యవహరించిందో, దేశమంతా చూసిందని తెలిపారు. బీజేపీకు ప్రజలు బుద్ధిచెప్పే రోజులు అతి త్వరలోనే వస్తుందని హరీశ్ రావు తెలిపారు.