రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు…
దిశ దశ, న్యూఢిల్లీ:
ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కోర్టులో హాజరు పర్చినప్పుడు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను ఉటంకించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు విచారించిన పలువురి వాంగ్మూలాల ఆధారంగా ఆమెకు సంబంధాలు ఉన్నాయని తేలిందని ఈడీ పేర్కొంది. అంతేకాకుండా ఆమె తమ విచారణలో సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని వివరించింది. అయితే ఈ కేసు విచారణలో తమకు అప్పగించిన మొబైల్ ఫోన్ల విషయంలోనూ సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించారంది. ఆమె మొబైల్ ఫోన్లు ఈడీ అధికారులకు అప్పగించినప్పటికీ, సుప్రీంలో మాత్రం బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారని, కేసు విచారణను డైవర్ట్ చేసేవిధంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. రాజకీయ ఆరోపణలు కూడా చేసి దర్యాప్తునకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని పేర్కొంది. అంతేకాకుండా ఆమె అప్పగించిన ఫోన్లలో నాలుగింటిని ఫార్మట్ చేసేశారని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యవహరించారని కూడా ఈడీ వివరించింది. 8008666666 నంబరు ఫోన్ లో ఆధారాలను డిలిట్ చేశారని ఈడీ ఆరోపించింది. ఆమె మార్చి 21న అప్పగించిన 9 మొబైల్ ఫోన్లను ప్రాథమికంగా పరిశీలించగా వాటిని కూడా ఫార్మట్ చేశారని, డాటా లేదని గుర్తించినట్టుగా పేర్కొంది. ఫార్మట్ చేశారా అని విచారణ సమయంలో అడిగితే చెప్పలేదని, వాటిని తన సిబ్బందికి ఇచ్చానని చెప్పారని, అయితే డాటాను తొలగించింది ఎవరూ..? ఎవరి సూచనల మేరకు తొలగించారని అడిగినప్పుడు దాటవేత ధోరణి అవలంచారని పేర్కొంది. 10 డివైజులను ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఎన్ఎఫ్ఎస్ యూకి పంపించామని, అందులో నాలుగు డివైజులు ఫార్మాట్ చేశారని తేలిందని ఈడీ వివరించింది. ఈ స్కాంలో తన ప్రమేయం బయటకు రాకుండా ఉండేందుకు డిజిటల్ సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు వాటిని డిలిట్ చేసినట్టుగా స్పష్టమవుతోందని ఈడీ పేర్కొంది. అలాగే విచారణకు హాజరైనప్పుడు ఫెమా యాక్ట ఉల్లంఘనకు సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు కూడా తప్పించుకునే విధంగా వ్యవహరించారని, అయితే బుచ్చబాబు వాట్సప్ ఛాటింగ్ ద్వారా 33 శాతం వాటా ఉన్నట్టుగా ఉందని కూడా ఆమెకు చూపించడం జరిగిందని ఈడీ వివరించింది.
అనిల్ కు నోటీసులు
మరో వైపున ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మరికొందరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత భర్త అనిల్, పీఆర్వోలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం వీరిని విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.