దిశ దశ, జగిత్యాల:
ఒకే నంబరుపై రెండు నెట్ వర్క్ లు పని చేస్తున్నాయి. పోర్ట్ ద్వారా మారినప్పటికీ పాత సిమ్ కంపెనీ దానిని బ్లాకు చేయకపోవడంతో యథావిధిగా పని చేస్తూనే ఉంది. కొత్తగా మారిన కంపెనీ కూడా ఇదే నంబరుపై మరో సిమ్ ను ఇవ్వగా అది కూడా పని చేస్తోంది. జగిత్యాల జిల్లా మల్యలా మండల కేంద్రానికి చెందిన నాగభూషణం చాలా కాలంగా బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ సిమ్ ను వాడుతున్నాడు. తరుచూ సిగ్నల్ సమస్యలు ఎదురవుతుండడంతో ఇటీవల పోర్ట్ ద్వారా వేరే నెట్ వర్క్ కు మారాడు. అయితే అప్పటికే వినియోగిస్తున్న బీఎస్ఎన్ఎల్ సిమ్ బ్లాక్ కాకపోవడంతో దానికి ఇప్పటికీ ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ నడుస్తున్నాయి. కొత్తగా మారిన నెట్ వర్క్ సిమ్ కూడా ఇదే నంబరుపై యాక్టివేట్ కాగా… ఇంతకు ముందున్న బీఎస్ఎన్ఎల్ సిమ్ కూడా యాక్టివేట్ లోనే ఉండడం గమనార్హం. వాస్తవంగా పోర్ట్ ద్వారా కస్టమర్ ఇతర కంపెనీలకు తన మొబైల్ నంబరును మార్చుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అప్పటి వరకు ఉన్న నెట్ వర్క్ కంపెనీ ఆ సిమ్ కార్డును బ్లాకు చేస్తుంది. కానీ బీఎస్ఎన్ఎల్ సంస్థ మాత్రం వినియోగదారుడు వేరే నెట్ వర్క్ లోకి తన నంబరును పోర్టు ద్వారా మార్చుకున్నప్పటికీ పాత సిమ్ కూడా పనిచేస్తుండడం విచిత్రం. ఒకే నెంబరుపై రెండు కంపెనీలకు సంబంధించిన నెట్ వర్కులు పని చేస్తుండడం వల్ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని నాగభూషణం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.