వరద నీటిలో మోరంచపల్లి
చిక్కుకున్న లారీ డ్రైవర్….
దిశ దశ, వరంగల్:
ఉమ్మడి వరంగల్ జిల్లా వరద బీభత్సంతో అతలా కుతలం అవుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో జలశయాలు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5 ఇంక్లైన్ వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు అక్కడకు చేరుకుని వాహనాల రాకపోకలను నిలువరించారు. మోరంచపల్లి గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరడంతో తెల్లవారు జామున 6 గంటల నుండి గ్రామం అంతా కూడా వరద నీటిలోనే చిక్కుకపోయింది. చాలా మంది ఇండ్లపైకి చేరుకుని ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. రాత్రి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్న మోరంచపల్లి వాసులను తెల్లవారే సరికి వరద నీరు చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామంలో ఓ లారి వరద నీటిలో చిక్కుకపోగా డ్రైవర్తో పాటు మరో వ్యక్తి లారీలోనే చిక్కుకపోగా, మరో వ్యక్తి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుండడంతో మోరంచపల్లి గ్రామస్థులు మరింత ఆందోళన చెందుతున్నారు. మరో వైపున పరకాల సమీపంలోని చలివాగుతో పాటు ఇతరాత్ర వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వాసులను కూడా వరదలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కటాక్షపూర్ తో పాటు పలు ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు… పస్రా రహదారిలోని ఓ వంతెన అప్రోచ్ రోడ్ కొట్టుకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.