ఆ విషాదానికి ఏడాది… జల ప్రళయంలో కొట్టుమిట్టాడిన మోరంచపల్లి…

దిశ దశ, భూపాలపల్లి:

అది జులై 26 2023… వాగు ఒడ్డున ఉన్న గ్రామస్థులంతా పశువులను పాకలో కట్టేసి… భొజనాలు చేసి నిద్ర పోయారు. మరునాడు నిద్ర లేచిన తరువాత పొలాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుని గాడ నిద్రలోకి జారుకున్నారు. కానీ ఆ గ్రామస్థులు ఊహించినట్టుగా ప్రకృతి వారిని ప్రశాంతంగా నిద్ర పోనివ్వలేదు.. గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న వాగు పొంగి పొర్లడంతో గ్రామం అంతా జలమయమైంది. కొన్ని ఇండ్లలో గ్రౌండ్ ఫ్లోర్ వరకూ వరద నీరు వచ్చి చేరడంతో పాకలో కట్టేసిన పశువులు అల్లాడిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో కమ్ముకున్న చీకట్లలో అసలేం జరుగుతోందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. వరద నీటి ప్రవాహంలో ఐదుగురు, లెక్కకు మించిన పశువులు కొట్టుకపోయాయి. 27వ తేది తెల్లవారే సరికి గ్రామమంతా హహాకారాలతో మారుమోగిపోయింది. మొబైల్ ఫోన్ల ద్వారా మమ్మల్ని కాపాడండి సార్ అంటూ గ్రామస్థులు జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు  మొరపెట్టుకున్నారు. గత సంవత్సరం భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో చోటు చేసుకున్న విషాద గాథ ఇది. గ్రామానికి చెందిన ఐదుగురు వరద నీటిలో గల్లంతు కాగా వారి ఆచూకి కోసం ప్రళయం శాంతించిన తరువాత అన్వేషణ మొదలు పెట్టారు స్థానికులు, పోలీసులు. ఎక్కడెక్కడో పంటపొలాల్లో పడిపోయిన శవాలను గుర్తించిన పోలీసులు తమ భుజాలపై మోసుకొచ్చారు. ఓ వైపున తమ వారు ఏమయ్యారన్న వేదన మరో వైపున పంటలతో పాటు ఆస్తిపాస్తులన్ని వరద పాలయ్యాయన్న ఆందోళనతో మోరంచపల్లి వాసులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే వారి కన్నీటి ధారలు కూడా వరద తనలో దాచుకుని వారి వేదనను సమాజానికి సకాలంలో చేరకుండా నిలువరించింది. చరిత్రలో ఏనాడు కూడా అంతటి ప్రళయాన్ని చవి చూడని మోరంచపల్లి వాసులను కలవరపెట్టిన వరద బీభత్సం చేసిన అతలాకుతలం అంతా ఇంతాకాదు. పాడి పంటలే జీవనాధారంగా బ్రతుకు వెల్లదీస్తున్న రైతులను వరదలు కుదిపేయడంతో నేటికి వారు కుదుటపడలేకపోతున్నారు. అప్పటికప్పడు భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా మోరంచపల్లి గ్రామస్థులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో్కి దింపింది. తాము బ్రతికితే చాలనుకున్న గ్రామస్థులు ఇండ్లపైకి ఎక్కి తాము క్షేమంగా ఉండేలా చూడాలని దేవుళ్లను ప్రార్థిస్తూ కాలం వెల్లదీశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అప్పటి కలెక్టర్ భ్రవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కర్ణాకర్, ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా చెల్పూరు సమీపంలోకి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. మోరంచపల్లి వాసుల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని పంపించి విడుతల వారిగా గ్రామాన్ని అంతా ఖాలీ చేశారు. వరద పూర్తిగా తగ్గిపోయిందని నిర్దారించుకున్న తరువాత పునరావస కేంద్రాల్లో ఉన్న ఊరి జనం తమ ఇండ్ల వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితులను చూసి రోధించిన తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మోరంచపల్లి గ్రామస్థులను భయాందోళనలకు గురి చేసిన వరదల గురించి ఊహించుకుంటేనే ఒళ్లు ఝలదరిస్తోంది కావచ్చు. అంతటీ బీభత్సాన్ని సృష్టించిన వరదల వల్ల పాడి పంటలే కాదు ఖర్చుల కోసం దాచి పెట్టుకున్న నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు కూడా కోల్పోయిన వారు లేకపోలేదు. వరద బీభత్సం ఉధృతి ఏ స్థాయిలో సాగిందంటే నేషనల్ హైవే కూడా కొట్టుకపోయి రాకపోకలను ఎక్కడిక్కడ స్తంభింపజేసింది. దీంతో భూపాలపల్లి జిల్లా ద్వీపకల్పంలో చిక్కుకపోగా రెండు మూడు రోజుల పాటు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేశాయి వరదలు.

 

ఇప్పటికీ ఆచూకి దొరకక…

ఆ నాటి వరద బీభత్సంతో పాడి పంటలే కాదు ఐధుగురు వ్యక్తులు కూడా కొట్టుకపోయారు. వరదల్లో గల్లంతయిన వారిలో గ్రామానికి చెందిన ఓ ఇంటి ‘‘మహాలక్ష్మీ’’ ఆఛూకి నేటికీ లభ్యం కాలేదు. వరద తగ్గుముఖం పట్టిన తరువాత ఓదార్పులు, బాసటనిచ్చేవారు కదిలివచ్చి గ్రామస్థులను అక్కున చేర్చుకున్నప్పటికీ ఆ గ్రామస్థులు చూసిన ప్రత్యక్ష్య నరకం తాలుకు చేదు అనుభవాలు మాత్రం నేటికి వారిని వెంటాడుతునే ఉన్నాయి.

You cannot copy content of this page