పలుచోట్ల ఏర్పాటుకు నిర్ణయం
దిశ దశ, హైదరాబాద్:
రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణపై రాష్ట్ర పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ క్రైమ్స్ కట్టడి చేయాలంటే ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేక యంత్రాంగం ఉండాలని భావించిన ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిల్లో మాత్రమే అందిస్తున్న ఈ విభాగం సేవలు ఇక నుండి క్షేత్ర స్థాయిలో కూడా అందనున్నాయి. ఇంతకాలం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఠాణాలను ఆశ్రయించిన బాధితులు ఇక నుండి సైబర్ క్రైం వింగ్ స్టేషన్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఏప్రిలో 2 నుండి రాష్ట్రంలోని రామగుండం, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ కమిషనరేట్ లలో కొత్తగా ఏర్పాటు కానున్న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లు తమ సేవలందింనున్నాయి. సైబర్ ఫ్రాడ్ తీవ్రంగా పెరిగిపోవడం… నేరగాళ్లు ఎక్కడో ఉండి మెసాలకు పాల్పతండడంతో రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరిగిపోతున్నది. ఈ క్రమంలో సైబర్ నేరాల దర్యాప్తు కోసం ప్రత్యేకంగా సైబర్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా కమిషనరేట్లకు ఇప్పటికే ఇందుకు సంబంధించిన మెటిరియల్ కూడా వచ్చి చేరింది. ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో దర్యాప్తు దశలో ఉన్న కేసులను ఈ స్టేషన్లకు బదిలీ చేయాలని కూడా ఆదేశాలు వచ్చాయి. ఈ స్టేషన్లు సంబంధిత పోలీసు కమిషనర్లు, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటి బ్యూరో (TSCSB)ల పర్యవేక్షణల కొనసాగనున్నాయి. శాంతి భద్రతల విభాగాల్లో సైబర్ నేరాలకు సంబందించిన ఫిర్యాదులు వచ్చినట్టయితే వాటిని వెంటనే సైబర్ స్టేషన్లకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇందులో లక్ష రూపాయలు ఆపైన జరిగే సైబర్ మోసాలకు సంబంధించిన కేసులను ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. సైబర్ కేసులను విచారించేందుకు కూడా ప్రత్యేకంగా కోర్టులను కూడా ఏర్పాటు కానున్నాయి.