సరిహధ్దు అడవుల్లో సరికొత్త నిఘా..? దండకారణ్యంలో ప్రత్యక్ష్యమైన ‘‘గద్ద’’…

జీపీఎస్ ట్రాకర్, కెమెరా ఉన్నాయంటున్న స్థానికులు

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య అటవీ ప్రాంతంలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు, బలగాల కార్యకలాపాలతో అట్టుడికిపోతున్న ఈ ప్రాంతంలో తాజాగా పక్షులు కూడా రంగంలోకి దిగినట్టుగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. తమను ఏరివేసేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని, అటవీ గ్రామాల్లో భయానక పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారని ఇప్పటికే మావోయిస్టులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిహధ్దు అటవీ గ్రామాల్లో గద్ద ప్రత్యక్ష్యం కావడం దాని కాలికి జీపీఎస్ ట్రాకర్, కెమెరా ఉండడం సరిహద్దు ప్రాంతాల్లో సరికొత్త చర్చకు దారి తీసింది.

సరిహద్దుల్లో ఏకాకిగా…

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలోని గుట్ట సమీపంలోని ఓ గూడెం వద్ద బుధవారం ఓ గద్ద వచ్చి వాలింది. అలిసిపోయినట్టుగా ఉన్న ఈ గద్దను గమనించిన స్థానికులు తాడుతో బంధించి దానికి కోడి మాంసంతో ఇతర ఆహార పదార్థాలను అందించారు. కొద్దిసేపు అక్కడే సెదదీరిన గద్ద అక్కడి నుండి ఎగిరిపోయింది. అయితే దాని కాలికి జీపీఎస్ ట్రాకర్, కెమెరా అమర్చి ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియో తీసిన వారి మాటలను బట్టి అయితే ఈ పక్షి మాత్రం చత్తీస్ గడ్ లోని సరిహద్దు గిరిజన గూడెంలో వాలిపోయి ఉంటుందని స్పష్టం అవుతోంది. వారంతా కూడా ఆదివాసీల మాతృ భాషతో పాటు హిందీలో మాట్లాతున్నందున తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలోకి మాత్రం రాలేదని అర్థమవుతోంది.

అంతర్గత భద్రతలోనూ..?

ఇప్పటి వరకు గద్దలను దేశ సరిహధ్దుల్లో మాత్రమే వినియోగించేదుకు ఆర్మీ బలగాలు ప్రయత్నిస్తున్నాయి. శత్రు దేశాల నుండి వచ్చే డ్రోన్లను కూల్చేందుకు గద్దలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. గద్దలు డ్రోన్లను గుర్తించి వాటిపై దాడి చేయగానే అవి కుప్పకూలిపోయే విధంగా శిక్షణ ఇచ్చి వాటి సేవలను వినియోగించుకుంటున్నట్టుగా మాత్రమే వెలుగులోకి వచ్చింది. కానీ తాజాగా తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహధ్దు అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ గద్దలు ఎక్కడివి అన్న చర్చ సాగుతోంది. మావోయిస్టులను ఏరివేసేందుకు వీటిని ప్రయోగించారా లేక మరెవరైన వీటిని దండకరాణ్య అటవీ ప్రాంతంలోకి వదిలారా అన్న విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. గతంలో ఇదే అటవీ ప్రాంతంలో బలగాలు వైమానిక దాడులకు పూనుకున్నాయంటూ బస్తర్ ప్రాంత మావోయిస్టు కమిటీ పలు ఫోటోలను కూడా విడుదల చేసింది ఇప్పపూలు ఏరుకునేందుకు వెల్లే ఆదివాసీలు ఈ వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా జీపీఎస్ ట్రాకర్, కెమెరా ఏర్పాటు చేసిన గద్ద ఉనికి వెలుగులోకి రావడం కొత్త చర్చకు దారి తీస్తోంది. అసలు వీటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎవరు వీటిని పంపించారో అన్న విషయం మాత్రం అంతుచిక్కకుండా పోతోంది. తెలంగాణ పోలీసులు మాత్రం వాటి గురించి తమకేమీ తెలియదని స్పష్టం చేశారని తెలుస్తోంది.

You cannot copy content of this page