కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్
దిశ దశ, హుజురాబాద్:
హిందూమతం గురించి మాట్లాడే బండి సంజయ్ కి రాజకీయాలెందుకు… మఠం పెట్టుకుంటే చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆదివారం హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… 24 గంటలు తాగి పడుకునే మీ అయ్యకు సీఎం పదవెందుకు..? బార్ పెట్టుకుంటా చాలాదా, నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలు ఎందుకు మసీదు పెట్టుకుంటే సరిపోదా అంటూ ప్రశ్నించారు. కండకావరమెక్కి మాట్లాడుతున్న కేటీఆర్ కు అధికారం పోయినా అహాంకారం మాత్రం తగ్గలేదని మండిపడ్డారు. 99 శాతం దేవుడిని నమ్మే వాళ్లున్న ఈ సమాజంలో నాస్తికుడైన కేటీఆర్ కు ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలన్నారు. కోట్ల రూపాయల ఆధాయం కోసమే యాదాద్రిని అభివృద్ది చేశామని చెప్పిన మూర్ఖుడు కేటీఆర్ అని, తెలంగాణాకు పట్టిన దరిద్రమే కేసీఆర్ కుటుంబామేని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మీ అరాచకాలకు, అహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసింది బీజేపీయేనని స్పష్టం చేశారు బండి సంజయ్. తాగి కారు నడిపే మీ అయ్యలాంటోళ్ల వల్లే కారు షెడ్డుకు పోయిందని, కనీసం రిపేరుకు కూడా పనికి రాకుండా పోయిందని విమర్శించారు. పాత సామనోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితి లేదని, కేటీఆర్ కు దమ్ముంటే బీఆర్ఎస్ పాలించినప్పుడు ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోదీ చేసిన అభివృద్దితో పాటు ఏ గ్రామానికి ఎన్ని నిధులుచ్చామన్న వివరాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది మూడో స్థానమేనని వ్యాఖ్యానించిన ఆయన మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్థానికేతరుడేనన్నారు. ఆయన ఏనాడు ప్రజలను కలవలేదని, ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఎన్నికలొస్తున్నాయిని డ్రామాలు ఆడుతున్నాడని, ఆయన మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ బండి సంజయ్య కామెంట్ చేశారు.