మళ్లీ అటాక్ స్టార్ట్… కేసీఆర్ కుటుంబం టార్గెట్…

దిశ దశ, హైదరాబాద్:

నిన్న మొన్నటి వరకూ సాదాసీదాగా వ్యాఖ్యలు చేసిన ఆ నేత మళ్లీ అటాక్ స్టార్ట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి విమర్శలు సంధిస్తున్నారు. ఉన్నట్టుండి ఆ నేత కౌంటర్ వేస్తుండడం చర్చకు దారి తీస్తోంది.

ఆ ఫ్యామిలీ టార్గెట్…

కేసీఆర్ కుంటుంబమే లక్ష్యంగా ఘాటు విమర్శలు చేసే బీజేపీ నేతల్లో ముందు వరసలో నిలిచిన జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కొంతకాలంగా దూకుడు తగ్గించారు. కరీంనగర్ పార్లమెంట్ కే పరిమితం అయిన బండి సంజయ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూ… ఢిల్లీ, కరీంనగర్ లో ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటన తర్వాత బండి మళ్లీ తన మాటల తూటలు పేల్చడం మొదలు పెట్టారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ టూర్ తర్వాత జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. అసలు పేరు అజయ్ రావు అయితే మంత్రి పదవి కోసం తారకరామారావుగా పేరు మార్చారంటూ సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ఇంతకాలం ఎన్టీయార్ పై అభిమానంతో చిన్ననాటే పేరు పెట్టుకున్నారన్న ప్రచారం అంతా వట్టిదేనని కేవలం మంత్రి పదవి కోసమే అజయ్ రావు కాస్తా తారకరామారావు అయ్యాడని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బుధవారం కరీంనగర్ లో మాట్లాడిన సంజయ్ బీఆర్ఎస్ పార్టీ చీలిపోనుందని చేసిన కామెంట్స్ కూడా చర్చకు దారి తీస్తున్నాయి. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రయత్నాల్లో సీఎం కేసీఆర్ నిమగ్నమయ్యారని… దీంతో గులాభి పార్టీలో చీలిక రావడం ఖాయమని సంజయ్ అన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో పార్టీ చీలిపోతుందని ఆయన మాట్లాడడం గమనార్హం. మరోవైపున కేసీఆర్ కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును దూరం పెట్టారంటూ మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు గమనిస్తే ఆయన తన దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది.

అధిష్టానం లైన్ క్లియర్…?

బండి సంజయ్ సడెన్ గా విమర్శల ధాటి పెంచడంపై డిస్కషన్ సాగుతోంది. పీఎం మోడీ నిజామాబాద్ జిల్లా టూర్ పూర్తయిన గంటల వ్యవధిలోనే బండి సంజయ్ వాగ్ధాటిని ప్రదర్శిస్తుండడం సంచలనంగా మారింది. ‘గో హెడ్’ అని అధిష్టానం చెప్పి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనను బాధ్యతల నుండి తప్పించిన తర్వాత పరిణామాలు తెలుసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా బండి సంజయ్ మళ్ళీ విమర్శలకు పదును పెడుతుండడం… కేసీఆర్ ఫ్యామిలీ లక్ష్యంగా ఆరోపణలు చేయడం మళ్ళీ మొదలు పెట్టడం మాత్రం కమలం క్యాడర్ కు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతోంది.

You cannot copy content of this page