పోటీలో నలుగురు ఎంపీలు
బీజేపీ కసరత్తులు పూర్తి
దిశ దశ, హైదరాబాద్:
బీజేపీ విడుదల చేయనున్న తొలి జాబితాలో నలుగురు ఎంపీలను కూడా అభ్యర్థులుగా ప్రకటించనుంది అధిష్టానం. ఈ మేరకు శుక్రవారం న్యూ ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీలుగా ఎన్నికైన జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని జాతీయ నాయకత్వం తేల్చి చెప్పింది. బీజేపీ పార్టీ ప్రభావం, ప్రధాని మోడీ ఎఫెక్ట్ తో పాటు ఎంపీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తే లోకసభ నియోజకవర్గాల్లోని ఏడు సెంగ్మెంట్లలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని యోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ పద్దతి వల్ల రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ తన ప్రభావాన్ని చాటుకునేందుకు మంచి అవకాశం దొరికినట్టయిందని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రం నుండి లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు నలుగురు కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం కాకతప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అంబర్ పేట నుండి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ నుండి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కోరుట్ల లేదా మరో నియోజకవర్గం నుండి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోథ్ నుండి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో హుజురాబాద్ ఈటల రాజేందర్, గద్వాల్ డికె అరుణ, జగిత్యాల బోగ శ్రావణిలతో పాటు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తన్న కూతురు, వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.
కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్…
అయితే తెలంగాణాలో నెలకొన్న పరిస్థితులు, ఇక్కడి ప్రజల నాడి తదితర అంశాలకు సంబంధించిన నివేదికలు లేటెస్ట్ గా బీజేపీ జాతీయ నాయకత్వం తెప్పించుకుంటున్నట్గుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులకు సంబంధించిన లోటుపాట్లతో పాటు అసెంబ్లీ నియోజకర్గాల ప్రజల అభిప్రాయాలను కూడా క్రోడీకరించి నివేదికలు ఇవ్వాలని ఇంటలీజెన్స్ బ్యూరో ఆదేశించడంతో ఈ మేరకు నివేదికలు జాతీయ నేతల వద్దకు చేరినట్టుగా తెలుస్తోంది. దీంతో ఏఏ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను బలమైన వారు ఉంటే సానుకూల ఫలితాలు రాబట్టవచ్చని అంచనా వేసి తొలి విడుత జాబితా విడుదల చేసేందుకు సమాయత్తం అయినట్టుగా సమాచారం. బీసీలకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా జాతీయ నాయత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ముహుర్త బలం చూసుకున్నట్టయితే మాత్రం బీజేపీ జాబితా సోమవారం నాడు వెలువడే అవకాశాలు ఉన్నాయి.