దిశ దశ, ములుగు:
ములుగు జిల్లాలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మలిదశ ఉద్యమ కారుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన జగదీశ్వర్ ను వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆసుపత్రిలోనే ఆయన కన్నుమూశారు. ఉద్యమ ప్రస్థానంలో కీలక భూమిక పోషించిన జగదీష్ ను అధినేత కేసీఆర్ గుర్తించి ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా బాద్యతలు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. పార్టీ కార్యకలాపాలతో పాటు పాలనాపరమైన అంశాల్లో చురుగ్గా వ్యవహరించే జగదీష్ గుండెపోటుతో కానరాని లోకాలకు వెల్లడంతో ములుగు జిల్లా వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ప్రముఖుల సంతాపం
జగదీష్ అకాల మరణంపట్లు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జగదీష్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, జడ్పీ ఛైర్మన్ గా ఆయన చేసిన సేవలను కొనియాడారు. జగదీష్ కుటుంబానికి బాసటగా ఉంటామన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంతో తమ ఉద్యమ సహచరున్ని కోల్పోయామన్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post