కేటీఆర్ కు ఝలక్ ఇచ్చిన మునిసిపల్ స్టాఫ్
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, సిరిసిల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుకు మునిసిపల్ అధికారులు ఝలక్ ఇచ్చారు. మరి కొద్ది సేపట్లో భవనాన్ని ప్రారంభించాల్సి ఉన్న క్రమంలో మునిసిపల్ యంత్రాంగం భవనం వద్దకు చేరుకుని లాక్ చేసేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 5వ వార్డులో సుభాష్ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయింది. ఈ భవనాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుందని భావించిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు అక్కడ ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేయించారు. కొంతమంది నాయకులు కూడా భవనం వద్దకు చేరుకున్న కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే మునిసిపల్ సిబ్బంది అక్కడకు వచ్చి కమ్యూనిటీ హాల్ బిల్డింగ్ షట్టర్లను మూసేసి తాళాలు వేసుకుని వెల్లిపోయారు. సడెన్ గా మునిసిపల్ సిబ్బంది వచ్చి కమ్యూనిటీ హాల్ కు లాక్ చేస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్ఘాంతపోయారు. అసలే జరుగుతోందో అర్థం కాక కొద్ది క్షణాలు ఆశ్యర్యంతో అలాగే ఉండి పోయారు. వెంటనే తేరుకుని లాక్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే పై అధికారులు తాళం వేయాలని చెప్పారన్న సమాధానం రావడంతో వారంతా ఖంగుతిన్నారు. కేటీఆర్ అక్కడకు చేరుకోనున్న క్రమంలో ఇదే ట్విస్ట్ రా అని బీఆర్ఎస్ శ్రేణులు మల్లగుల్లాలు పడ్డాయి.
కారణం అదేనా..?
అయితే సుభాష్ నగర్ కమ్యూనిటీ భవన నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదన్న ఫిర్యాదులు రావడంతో ప్రారంభోత్సవం జరపకుండా మునిసిపల్ సిబ్బంది నిలువరించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం కమ్యూనిటీ హాల్ కు లాక్ వేసిన విషయంపై ఎవరూ చెప్పడం లేదు. భవనం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్ మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించినప్పుడు క్వాలిటీ చెకింగ్ జరకుండానే స్వాధీనం చేసుకున్నారా, ఇన్ని రోజులు రాని ఫిర్యాదులు కేటీఆర్ ప్రారంభోత్సవ ముహుర్తానికి కొద్దిసేపటి ముందే ఫిర్యాదు రావడం ఏంటని సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యత పాటించనట్టయితే కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చారా..? తనిఖీ చేసేందుకు ఇంజనీరింగ్ విభాగాన్ని పురమాయించారా అన్న విషయంపై కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. బిల్డింగ్ క్వాలిటీ చెకింగ్ చేసిన తరువాతే ఫైనల్ బిల్ చేయడం ఆనవాయితీగా ఉంటుంది, ఎంబీ రికార్డు చేసిన వారిపై కూడా శాఖ పరంగా విచారణ జరిపేందుకు మునిసిపల్ అధికారులు ముందుకు రావల్సిన అవసరం కూడా ఉంటుందని స్థానిక నాయకులు అంటున్నారు. టెక్నికల్ గా సర్టిఫై చేసిన తరువాతే మునిసిపాలిటీ కాంట్రాక్టర్ నుండి హైండోవర్ చేసుకుందంటే ఇందుకు మునిసిపల్ అధికారులు కూడా బాధ్యులు కావల్సి వస్తుందన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మునిసిపల్ ఆధీనంలో ఉన్న ఈ భవన ప్రారంభోత్సవ విషయం అధికారుల నోటీసులో ఉండే ఏర్పాట్లు జరిగాయని, ఇప్పటి వరకు లేని అభ్యంతరం ఇనాగ్రేషన్ కు కొద్ది సేపటి ముందు ఎందుక వచ్చిందన్నదే అంతు చిక్కకుండా పోతోందని సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు చర్చించుకుటున్నారు.