అసెట్స్ కేసులో దాడులు చేసిన ఏసీబీ
దిశ దశ, నిజామాబాద్:
అవినీతికి పాల్పుడుతూ కోట్లకు పడగలెత్తని అధికారయంత్రాంగం భరతం పట్టడంలో తెలంగాణ ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తూనే ఉంది. ఉన్నత స్థాయి అధికారే అయినా కింది స్థాయి ఉద్యోగే అయినా ఎవరినీ వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు బృందం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాడులు చేపట్టింది. శుక్రవారం స్థానిక మునిసిపల్ సూపరింటిండెంట్ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. నిజామాబాద్ మునిసిపల్ సూపరింటిండెంట్, ఇంఛార్జి రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంట్లో రూ. 6.07 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఈ సోదాల్లో ఇంట్లో దాచి పెట్టిన నగదుతో పాటు బ్యాంకు బ్యాలెన్స్ రూ. 2.93 కోట్లు, అతని భార్య, తల్లికి చెందిన ఖాతాలలో రూ. 1.10 కోట్లు, రూ. 6 లక్షల విలువ చేసే 51 తులాల బంగారం, రూ. 1.98 కోట్ల విలువ చేసే స్థిరాస్థులను ఇప్పటి వరకు గుర్తించారు. దాసరి నరేందర్ పై అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 13 (1)(బి), 13 (2)ల కింద కేసు నమోదు చేశారు. నరేందర్ ను హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరు పర్చనున్నారు. అయితే నరేందర్ కు సంబంధించిన ఇతరాత్ర ఆస్తులతో పాటు బినామీలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.