మార్చి 8 నుంచి పురపాలక శాఖ మహిళా వారోత్సవాలు: కేటీఆర్

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్‌ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, దీనికి సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను ప్రకటించింది.

మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది. పురపాలికల్లో పలు హోదాల్లో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పలు ఎన్జీవోల సిబ్బందితో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే ఈ మహిళ వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఏదైనా ఒక రంగంలో ముఖ్యంగా డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ లాంటి మొదలైన రంగాల్లో ఆదర్శవంతమైన పద్ధతుల్లో ముందుకెళ్తున్న పురపాలికల సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని కేటీఆర్ సూచించారు. దీంతో పాటు పట్టణాల్లో మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు. కంటి వెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మహిళా రక్షణ, మహిళ ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారికత వంటి అంశాల పైన ప్రత్యేక సమావేశాలు చర్చాగోష్టులను నిర్వహించి మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దీంతో పాటు ఈ వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలని తెలిపారు. ఈ మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.

You cannot copy content of this page