దిశ దశ, జగిత్యాల:
తమకు రెండు నెలలుగా జీతాలు రావడం లేదంటూ ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. మునిసిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి తమకు వెంటనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పురపాలక సంఘ కార్యాలయం ముందు ఔట్ సోర్సింగ్ కార్మికులు మంగగళవారం ధర్నా చేశారు. రెండు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులు తమకు జీతాలు ఇవ్వకపోవడంతో పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి తయారైందన్నారు. ధర్నా చేస్తున్న కార్మికులతో మాట్లాడిన మునిసిపల్ కమిషనర్ సముదాయించేందుకు ప్రయత్నించారు. రెండు నెలల వేతనాలతో పాటు తమకు రావాల్సిన పీఆర్సి బకాయిలను చెల్లించే వరకూ విధుల్లో చేరేది లేదని కార్మికులు స్పష్టం చేశారు. చెత్త సేకరణ కోసం వాహనాలు మునిసిపల్ ఆఫీసు నుండి బయటకు రాకుండా గేటు ముందే ధర్నాకు దిగారు. ఔట్ సోర్సింగ్ కార్మికులు వేతనాల కోసం నిరసన చేపట్టడంతో పట్టణంలో చెత్త సేకరణ నిలిచిపోయింది.