జూన్ లో జరిగిన హత్యపై సెప్టెంబర్ లో ఆరోపణలు

దిశ దశ, న్యూ ఢిల్లీ:

ఖలిస్తాన్ చిచ్చు ఏకంగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతిసింది. ఇరు దేశాల్లోని సీనియర్ దౌత్యవేత్తలను తమ దేశం వదిలి వెల్లిపోవాలని తేల్చి చెప్పాయి. దీంతో ఇండియా, కెనెడా దేశాల మధ్య స్నేహ సంబంధాలకు బ్రేకులు పడేవైపు సాగుతున్నాయి. తాజాగా నెలకొన్న పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న చర్చ మొదలైంది.

జూన్ లో హత్య…

కెనడాలో నివాసం ఉంటున్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీవ్ సింగ్ నిజ్జర్ గత జూన్ నెలలో హత్యకు గురయ్యాడు. 1997లో కెనడాకు వెళ్లిన ఆయన పంజాబ్ ను వేరు చేసి సి్కులకు ప్రత్యేక దేశంగా ఖలిస్తాన్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వెలిబుచ్చారు. పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తుతు వేర్పాటు వాద ధోరణిని అవలంబించాడన్న ఆరోపణలు భారత్ చేస్తోంది. భారతదేశంలో ఉగ్ర కుట్రలకు పాల్పడడంతో పాటు 2007లో పంజాబ్ లో జరిగిన ఓ బాంబుదాడిలో నిజ్జర్ నిందితునిగా ఉన్నాడని యాంటీ టెర్రర్ ఆర్గనైజేషన్ అతనిపై రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది. అయితే నిజ్జర్ కెనాడాలోనే గత జూన్ నెలలో హత్యకు గురికావడం సంచలనం లేపింది. ఈ అంశం గురించి తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో మాట్లాడుతూ… నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది.

భారత్ కౌంటర్

కెనడా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ కూడా కౌంటర్ అటాక్ చేయడం ఆరంభించింది. భారత్ లో ఉన్న కెనడా సీనియర్ దౌత్యవేత్త కామెరూన్‌ మెక్‌కేని విదేశాంగ శాఖ పిలిపించి ఐదు రోజుల్లో భారత్ విడిచి వెల్లిపోవాలని స్పష్టం చేసింది. భారత అంతర్గత విషయాల్లో కెనడియన్ దౌత్యవేత్తల జోక్యం, భారత వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రమేయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు భారత విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు.

జీ20 సమావేశాలకు…

జీ20 దేశాల సమావేశం ఇటీవల భారత్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోడి మాట్టాడుతూ… ఖలిస్తాన్ సానుభూతిపరుల విషయంలో కెనడా ప్రభుత్వం చూపుతున్న ఉదారవాదాన్ని ఎత్తి చూపారు. ఇలాంటి చర్యలు మంచివి కావని, కెనడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావలని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. దీంతో భారత్ తో వాణిజ్య ఒప్పందానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ట్రేడ్ మిషన్ ప్రక్రియ నిలిచిపోయింది.

మూడు నెలల తరువాత..

జూన్ లో కెనడాలో నిజ్జర్ హత్య జరగగా ఇప్పుడు ఈ అంశాన్ని కెనడా ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకుందోనన్నదే చర్చనీయాంశంగా మారింది. నిజ్జర్ హత్య జరిగిన వెంటనే భారత్ వ్యవహరశైలిని తప్పు పట్టడం కానీ, ఈ హత్య వెనక భారత్ హస్తం ఉందని కాని ఆరోపించిన దాఖలాలు అయితే లేవు. ఇలాంటి అభిప్రాయమే ఉన్నట్టయితే జి20 సమ్మిట్ కు కెనడా ప్రధాని హాజరు అయినప్పుడు కూడా ఈ అంశాన్ని లేవనెత్తలేదు. వాస్తవంగా భారత్ తప్పు ఉన్నట్టయితే జి20 సమ్మిట్ జరగకముందు నుండే కెనడా ప్రభుత్వం ఆరోపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కనీసం జి20 సదస్సులో అయినా ఈ విషయాన్ని లేవనెత్తినట్టయితే ఇతర దేశాలు కూడా ఈ అంశం గురించి చర్చించేవి. అయితే ఇదే సదస్సులో భారత ప్రధాని మోడీ మాత్రం కెనడా వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టడంతో తామెప్పుడు హింసను నిరోధించేందుకు సిద్దంగా ఉంటామని ట్రూడో ప్రకటించారు. జి20 సదస్సులో భారత్ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించిన కెనడా ప్రధాని ఇప్పుడు నిజ్జర్ హత్యకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి భారత్పై ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page