హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి…

పోలీసులకు అడ్డంగా దొరికిపోయారా..?

దిశ దశ, వరంగల్:

హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి జాక్ పాట్ కొట్టేద్దామని భారీ స్కెచ్ వేసిన భార్య, ఆమెతో చేతులు కలిపిన మరికొందరి గుట్టుపై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఎవరికీ అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేరాల దర్యాప్తు విషయంలో అన్ని కోణాలను ఆలోచించే పోలీసులకు వచ్చిన ఓ అనుమానం వారి బండారాన్ని బయటపెట్టింది. మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయిన పోలీసులు గుర్తించిన విషయాలకు సంబంధించిన విశ్వసనీయంగా సమాచారం మేరకు… ఈ నెల 20వ తేది రాత్రి ఖాజీపేటలోని తన క్లినిక్ నుండి కారులో బయలుదేరిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సుమంత్ రెడ్డిని బైక్ పై వెంటాడిన ఇద్దరు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే సుమంత్ రెడ్డిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయాలనుకున్నారు. కడిపికొండ, ఖాజీపేట మీదుగా ఖమ్మం బ్రిడ్జి వరకు అను సంధానం చేస్తూ నిర్మించిన ఈ రోడ్డు మీదుగానే డాక్టర్ రాకపోకలు సాగిస్తుంటారు. అంతగా జనం కూడా కనిపించని ఈ రహదారి మీదుగా వెల్తే త్వరగా గమ్యానికి చేరుకుంటామని భావించి ఆయన ఈ మార్గం మీదుగానే క్లినిక్ కు వెల్లి వస్తుంటారు. అయితే ఆయనను హత్య చేసేందుకు ఇదే రోడ్డు అయితే బావుంటుందని స్కెచ్ వేసి క్లినిక్ నుండి ఇంటికి తిరిగి వెల్తుండగా బైక్ పై వెంటాడుతూ యాక్సిడెంట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. బైక్ పై వచ్చి ఇద్దరు వ్యక్తులు కారు ముందు వైపు నడుపుతూ అదుపుతప్పి పడిపోయేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయితే వారిని తప్పించుకుంటూ డాక్టర్ సుమంత్ రెడ్డి ముందుకు వెల్తుండడంతో కొంతదూరం వెంటాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఆయన తప్పించుకుంటున్నాడన్న విషయాన్ని గమనించిన అగంతకులు కారు వెనక భాగంలో రాడ్ తో దాడి చేయడంతో ఆయన కారును ఆపగానే డోర్ వద్దకు వెల్లిన నిందితులు అతన్ని దారుణంగా హత్య చేసి అక్కడి నుండి పారిపోయారు.

డామిట్ కథ అడ్డం తిరిగింది…

డాక్టర్ సుమంత్ రెడ్డి వారి బారిన పడకుండా తప్పించుకోవడంతో జనం రాకపోకలు సాగించే చోట ఆయనను హత్య చేయాల్సిన పరిస్థితి ఎదురైనట్టుగా తెలుస్తోంది. వివాహేతర బంధానికి అడ్డంకిగా ఉన్న ఆయనను హత్య చేస్తే ఆస్తితో పాటు భవిష్యత్తు అంతా సుఖమయ జీవనం సాగించాలని అంచనాలు వేసుకుని వ్యూహత్మకంగా వ్యవహరించారు. డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేసిన తరువాత స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. సుమంత్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని నిర్దారించుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీశారు. ఆయనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్న వివరాలు తెలుసుకున్నప్పుడు ఆయన సౌమ్యుడని ఎవ్వరిని నొప్పించే వ్యక్తిత్వం లేదని తేలింది. దీంతో పోలీసులకు సుమంత్ రెడ్డి హత్య కేసు పజిల్ గా మారినట్టయింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవడంతో వారు ఎవరనేది తేల్చుకునే పరిస్థితి లేకుండా పోవడంతో పాటు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. నిందితులు ఏఏ ప్రాంతాల్లో సంచరించి ఉంటారోనన్న విషయం తెలుసుకునేందుకు ఖాజీపేటలోని పలు సీసీ కెమెరాల ఫుటేజీని పరీక్షించగా ఓ కెమెరాలో హెల్మెట్ ధరించి ఉన్న రికార్డు దొరికింది. అయితే బైక్ నంబర్ స్పష్టంగా పడకపోవడంతో పోలీసులు ఎలా ముందుకు సాగాలోనన్న విషయంపై సమాలోచనలు జరిపారు. ఎందుకైనా మంచిదని ఆయన భార్య నంబర్ కాల్ డాటా రికార్డ్ (CDR) తీయడంతో కేసు కొత్త మలుపు తిరిగినట్టుగా తెలుస్తోంది. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆమె నంబర్ ద్వారా సస్పెక్టెడ్ నెంబర్లకు కాల్ చేసినట్టుగా నిర్దారించుకున్నారు పోలీసులు. మర్డర్ స్కెచ్ లో ఆమె పాత్ర కూడా ఉండి ఉంటుందన్న అనుమానం వచ్చిన పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలోని టవర్లలో అనుమానిత నంబర్లు లోకేట్ అయ్యాయా అన్న విషయంపై ఆరా తీశారు. అయితే నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ మొబైల్ ఫోన్లను ఓ చోట దాచిపెట్టి బైక్ పై డాక్టర్ సుమంత్ రెడ్డిని వెంటాడినట్టుగా తేలినట్టు సమాచారం. దీంతో అతని భార్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేయడంతో అసలు నిజం ఒప్పుకున్నట్టుగా సమాచారం. డాక్టర్ సుమంత్ రెడ్డి కొంతకాలం సంగారెడ్డిలో క్లినిక్ నిర్వహిస్తున్న క్రమంలో ఆమె పరిచయం అయిందని అక్కడే ఆమెను పెళ్లి చేసుకున్నాడని ఇటీవలే ఖాజీపేటకు షిప్ట్ అయ్యారని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.

ఖాకీ సపోర్ట్..?

అయితే డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్య చేసేందుకు హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న రిజర్వూ పోలీసు ఒకరు తనవంతు పాత్ర పోషించినట్టుగా పోలీసుల విచారనలో తేలినట్టుగా సమాచారం. ఈ మర్డర్ కేసులో సహకరించినట్టయితే సుపారీ కూడా ఇచ్చేందుకు ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తోంది. సుపారీ ఆశతో సదరు పోలీసు ఉద్యోగి హత్యకు సంబంధించిన స్కెచ్ వేయడంతో పాటు పోలీసుకుల చిక్కకుండా ఉండేందుకు అవసరమైన పథకాన్ని రచించి ఉంటాడని పోలీసు అధికారులు అనుమానిస్తున్నట్టు సమాచారం. నిందితులకు సంబంధించిన మరిన్ని టెక్నికల్ ఎవిడెన్స్ లు సేకరిస్తున్న వరంగల్ కమిషనరేట్ పోలీసు అధికారులు వీరిపై వివాహేతర బంధంతో హత్య చేశారని, ఆస్తి కోసం కూడా స్కెచ్ వేసి ఇందుకు కుట్ర పన్నారన్న సెక్షన్లలో పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అనుమానితులను కూడా విచారించాల్సిన ఆవశ్యకత ఉన్నందున వారి నుండి మరిన్ని వివరాలు రాబట్టే యోచనలో కూడా పోలీసు అధికారులు ఉన్నట్టుగా సమాచారం. మర్డర్ స్కెచ్ పై పోలీసుల అనుమానాలు, ప్రత్యక్ష్య సాక్ష్యుల సమాచారంతో హంతకులు వేసిన పథకాన్ని వెలుగులోకి తెచ్చింది. అయితే ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.

You cannot copy content of this page