ఢిల్లీ పెద్దలకు ఎమ్మెల్సీ లేఖ
దిశ దశ, జగిత్యాల:
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు జగిత్యాల చుట్టే తిరుగుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల అంశంపై సొంత పార్టీ నుండే వ్యతిరేకత వస్తుండడం అధికార పార్టీకి మింగుడు పడకుండా తయారైంది. తాజాగా ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాసిన లేఖను ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు పంపించారు. ఇతర పార్టీల నుండి వలసలను ప్రొత్సహించే విధానానికి స్వర్గీయ రాజీవ్ గాంధీ కూడా వ్యతిరేకమని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పద్దతిని పెంచి పోషించడం సరికాదంటూ ఆ లేఖలో వెల్లడించారు. దీంతో బుధవారం వరకు గాంధీ భవన్ వరకే పరిమితం అయిన ఈ అంశం కాస్తా ఢిల్లీకి చేరింది.
గంగారెడ్డి హత్యతో…
అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి చేతిలో తన ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురి కావడాన్ని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన హత్య తరువాత రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకుల తీరుపై మండిపడుతున్నారు. చివరకు ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా జీవన్ రెడ్డి విషయంలో తాను మాట్లాడుతానని ప్రకటించారు. అయినప్పటికీ ఆయన మాత్రం గంగారెడ్డి హత్య విషయంలో వెనక్కి తగ్గకపోవడం విస్మయం కల్గిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని చేర్పించుకున్న విషయంలో అగ్గిమీద గుగ్గిళం అయిన జీవన్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో చర్చించిన తరువాత కాస్తా చల్లబడ్డారు. మానసికంగా ఆవేదనకు గురవుతున్న ఆయన తన అనుచరులకు నామినేటెడ్ పోస్టులు వస్తాయని, తన ప్రయారిటీ తగ్గదని అనుకున్నారు. కానీ సంజయ్ చేరిక తరువాత అధికారం అంతా తన చేయి జారిపోతున్న విషయాన్ని గమనించిన జీవన్ రెడ్డి తన అనచరులకు నామినేటెడ్ పోస్టులు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గంగారెడ్డి మర్డర్ జరగడంతో జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. మీడియాతో ఆయన ఘాటుగా స్పందిస్తున్న తీరుపై అధిష్టానం కూడా ఆచూతూచి వ్యవహరించింది. గురువారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. పార్టీ ఫిరాయింపు అంశాన్ని తెరపైకి తీసుకరావడమే కాకుండా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఠా అంటూ చేసిన కామెంట్స్ సరికొత్త చర్చకు దారి తీశాయి. బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపుల విషయంలో కీలకంగా వ్యవహరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నారని విమర్శించారు. అలాగే పార్టీ ఫిరాయింపుల విధానానికి స్వర్గీయ రాజీవ్ గాంధీ కూడా వ్యతిరేకమన్న విషయాన్ని ఊటంకించడమే కాకుండా సంపూర్ణ మెజార్టీ ఉన్న తెలంగాణాలో ఇతర పార్టీల నుండి వలస వచ్చే వారిని చేర్పించుకోవడం తప్పని చెప్తూ ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. మరో వైపున జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై డైరక్ట్ అటాక్ చేశారు జీవన్ రెడ్డి. తన అనుచరుడిని కిరాతకంగా చంపించారంటూ జీవన్ రెడ్డి ఆరోపణలకు దిగారు.
రాజకీయ హత్య కాదు…
అయితే గంగారెడ్డి హత్య విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా స్పందించారు. హత్య జరిగిన రోజునే నిందితులను కఠినంగా శిక్షించాలని, ఎంతటి వారైనా వదిలేయవద్దని పోలీసులకు స్పష్టం చేశారు. అయితే తాజాగా గురువారం జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డాక్టర్ సంజయ్ తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా తీసుకోలేదని వెల్లడించారు. అంతేకాకుండా తాను కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వారసుడినేని కూడా కుండబద్దలు కొట్టారు సంజయ్. తన చిన్న తాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ అని, ఇతర కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీవారేని గుర్తుపెట్టుకోవాలన్నారు. గంగారెడ్డి హత్య వెనక రాజకీయ కోణం లేదని స్థానికంగా నెలకొన్న కక్షలే కారణమని తేల్చి చెప్పారు. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి స్పందించారు. గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్ష్యలే కారణమని వెల్లడించిన ఆయన జీవన్ రెడ్డి మాత్రం ఆయనను చంపింది బీఆర్ఎస్ పార్టీ నాయకులేనని అనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరిగినందు వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నామని, అయితే వీరి చేరికతో పార్టీలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని టీపీసీసీ చీఫ్ ఒప్పుకున్నారు.
హాట్ టాపిక్…
కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎపిసోడే హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే పంచాయితీలా గంగారెడ్డి హత్య మారిపోవడంతో… ఎలా సంధి కుదుర్చాలోనన్న విషయంపై పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి ఏఐసీసీ అధినేతకు కూడా లేఖ రాయడంతో అదిష్టానానికి వివరణ ఇచ్చేందుకు కూడా సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సద్దుమణగుతుందని, టీ కప్పులో తుపానులాంటిదేనని మొదట కాంగ్రెస్ నాయకులు భావించినప్పటికీ జీవన్ రెడ్డి మాత్రం పట్టు వీడకుండా వ్యహరిస్తుండడం విశేషం.