ఇనుప రాడ్ తో దాడి చేసి… సెప్టిక్ ట్యాంకులో పడేసి…

జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్య

దిశ దశ, దండకారణ్యం:

బీజాపూర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్యపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి పర్యవేక్షణలో మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ముఖేష్ హత్య కేసును ఛేదించేందుకు బీజాపూర్ అడిషనల్ ఎస్పీ మయాంక్ గుర్జార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ‘‘సిట్’’ ఏర్పాటు చేశారు. టెక్నికాలజీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాంట్రాక్టు పనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న విషయాన్ని వెలుగులోకి తేవడం వల్ల తమకు ఇబ్బందికరంగా మారిందన్న ఉద్దేశ్యంతోనే జర్నలిస్టును హత్య చేసినట్టుగా దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

జనవరి 1న…

జనవరి 1వ తేది రాత్రి జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ అదృశ్యం కాగా అతని ఆచూకి కోసం సోదరుడు జర్నలిస్ట్ యుకేష్ చంద్రాకర్ ఆరా తీశాడు. 2వ తేది రాత్రి 7.30 గంటలకు కొత్వాలి బీజాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో క్రైం నంబర్ 1/2025లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ముకేష్ ఆచూకి కోసం వారి బంధువులు, సహచర జర్నలిస్టులను విచారించారు. అనుమానితుల కాల్ డాటా రికార్డ్ (CDR) సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. ముఖేష్ తో పాటు అనుమానితులకు సంబంధించిన మొబైల్స్ టవర్ లోకేషన్ సేకరించిన పోలీసులు జనవరి 2వ తేది రాత్రి చట్టన్ పారాలోని కాంట్రాక్టర్ చంద్రాకర్ కు సంబంధించిన అక్రమ కట్టడంలోని గదులన్నింటిని తనిఖీ చేశారు. 3వ తేదిన అదే అక్రమ కట్టడంలోని బ్మాడ్మింటర్ కోర్టులో సెప్టిక్ ట్యాంకుపై కాంక్రీట్ ఫ్లోర్ వేసిన విషయాన్ని పోలీసులు గమనించారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో మద్యాహ్నం 2.30 గంటల సమయంలో తహసీల్దార్, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ అక్రమ కట్టడం వద్దకు చేరుకున్నారు. ఆ తరువాత జేసీబీ ద్వారా సెప్టిక్ ట్యాంకుపై వేసిన కాంక్రీట్ ఫ్లోరింగ్ ను తొలగించి ట్యాంకుపై ఉన్న మూతను తెరవడంతో ముఖేష్ మృతదేహం బయటపడింది. అతని చేతిపై ఉన్న పచ్చబొట్టును గమనించి ఆ శవం ముఖేష్ చంద్రాకర్ దేనని నిర్దారించుకున్న దర్యాప్తు అధికారులు శవానికి పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చారు. క్రైమ్ నంబర్ 01/2025, BNS సెక్షన్ 103, 238, 61, 3 (5) కింద బీజాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారు పోలీసులు.

ఆరోజు ఏం జరిగిందంటే..?

జనవరి 1వ తేది రాత్రి 8 గంటల సమయంలో ముఖేష్ చంద్రాకర్, కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ సోదరుడు రితేష్ చంద్రాకర్ లు మొబైల్ ఫోన్లో మాట్లాడుకున్నారు. అనంతరం చట్టన్ పారాలోని కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ అక్రమంగా నిర్మించిన ఎన్ క్లోజర్ వద్దకు చేరుకున్న ముఖేష్ చంద్రాకర్, రితేష్ చంద్రాకర్ లు భోజనం చేస్తూ తమ కాంట్రాక్టు పనులకు అడ్డుగా వస్తున్న విషయం గురించి చర్చించారు. అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం రితేష్ చంద్రాకర్, అతని సూపర్ వైజర్ మహేంద్ర రామ్ టేకేలు ఇనుప రాడ్డుతో ముఖేష్ పై దాడి చేసి హత్య చేశారు. అతని తల, ఛాతి, కడుపు, వీపుపై రాడ్ తో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. శవాన్ని కనిపించకుండా చేయాలని భావించిన నిందితులిద్దరు సెప్టిక్ ట్యాంకులో పడేశారు. నిందితుల్లో ఒకరైన రితేష్ చంద్రాకర్ అన్న సురేష్ చంద్రాకర్, ఇతర కుటుంబ సభ్యులు జగ్దల్ పూర్ లో మరో సోదురుడు దినేష్ చంద్రాకర్ తో సంప్రదింపులు జరిపి బొడ్లి వైపు వెల్లిపోగా… జగ్దల్ పూర్ లో ఉన్న దినేష్ చంద్రాకర్ కూడా అక్కడకు చేరుకున్నాడు. వీరంతా కూడా సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు ఏం చేయాలోనని సమాలోచనలు జరిపారు. జర్నలిస్ట్ ముఖేష్ శవాన్ని వేసిన సెప్టిక్ ట్యాంకును కాంక్రీట్ తో క్లోజ్ చేయాలని దినేష్ చంద్రాకర్ సలహా ఇచ్చి రాయ్ పూర్ కు వెల్లిపోయాడు. 2వ తేది ఉదయం ముఖేష్ చంద్రాకర్ శవాన్ని వేసిన సెప్టిక్ ట్యాంకును సిమెంట్ ఫ్లోరింగ్ వేసి మూసేశారు. అదే రోజు సాయంత్రం రితేష్ చంద్రాకర్ రాయ్ పూర్ నుండి న్యూ ఢిల్లీకి బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని రాయ్ పూర్ కు పంపించడంతో రితేష్ చంద్రాకర్ ను ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. బీజాపూర్ లో సూపర్ వైజర్ మహేంద్ర రామ్ టేకే, దినేష్ చంద్రాకర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఓ ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ ను పట్టుకునేందుకు సిట్ టీమ్స్ నాలుగు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

అష్టదిగ్భంధనం…

కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ పై పోలీసులు అష్టదిగ్భందనం చేసే పనిలో పడ్డారు. పోలీసులు కాంట్రాక్టర్ చంద్రాకర్ కు చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించినట్టుగా తెలిసింది. మూడు బ్యాంకు ఖాతాలను కూడా హోల్డ్ లో పెట్టించిన పోలీసులు సురేష్ చంద్రాకర్, ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తున్నారు. అలాగే చట్టన్ పారాలో నిర్మించిన అక్రమ ఎన్ క్లోజర్ లను బుల్డోజర్లతో కూల్చివేయించారు. నిందితులను పట్టుకో్వడంతో పాటు వారికి కఠిన శిక్షలు పడే విధంగా టెక్నికల్ ఎవిడెన్స్ లను సేకరించి కోర్టులో సమర్పిస్తామని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి ప్రకటించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. బస్తర్ పూర్వ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా జర్నలిస్టు హత్యపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటూ మండిపడుతున్నారు. ప్రియాంకా గాంధీ కూడా ముఖేష్ చంద్రాకర్ హత్యను తీవ్రంగా ఖండించారు. చత్తీస్ గడ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు. 

You cannot copy content of this page