మట్టుబెట్టేందుకు మచ్చిక చేసుకోమని చెప్పి… అసలు నిందితుల స్థానంలో వేరేవారిని చేర్చి…

వరంగల్ జిల్లాలో సూపరీ గ్యాంగ్ అరెస్ట్…

దిశ దశ, వరంగల్:

హత్యకు గురైన వ్యక్తి సన్నిహితులు అతని శత్రువును ఎందుకు కలిశారు..? జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వారిని ములాఖత్ కావడానికి కారణం ఏంటీ..? రియల్ ఎస్టేట్ దందా ముసుగులో జరిగిన రియల్ స్టోరీ ఏంటీ..? క్రైం థిల్లర్ మూవీ కథను మరిపించే విధంగా ఉన్న ఈ నేరం వెనుక జరిగిన అసలేం జరిగింది..? కేసులను ఛేదించడంలో విభిన్న కోణాలను ఆవిష్కరించే పోలీసులు ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినా… వారిని అనుమానం వెంటాడుతూనే ఉంది. అదే అసలు నిందితులను పట్టించడానికి ముఖ్య కారణమైంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ క్రైం వెనక ఉన్న కుట్రను పోలీసులు ఎలా ఛేదించారు..? అసలు నిందితులె వరు..? తండ్రికి కూడా తెలియకుండా తనయుడు చేసిన ఓ మర్డర్ స్కెచ్ వెనక ఏం జరిగింది..?

మాజీ సర్పంచ్ హత్య…

రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని బురహాన్ పల్లి మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ ను గత నెలలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్య వెనక రాజకీయ కక్ష్యలు ఉన్నాయేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ప్రత్యర్థులే అతన్ని పక్కా ప్లాన్ చేసి మర్డర్ చేసి ఉంటారా లేక మరేదైనా కారణం ఉందా అన్న చర్చ వరంగల్ జిల్లా వ్యాప్తంగా సాగింది. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు పలు కోణాల్లో ఆరా తీయడం ఆరంభించారు. ఈ హత్య వెనక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందమోనన్న ప్రచారం జరగడంతో పోలీసులు సునిశితంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. సాంకేతికపరమైన ఆధారాలతో పాటు నేర పరిశోధనలో వివిధ కోణాల్లో ఆరా తీయడం మొదలు పెట్టారు.

సాక్ష్యాలు తారుమారు…

మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ హత్య తరువాత నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ మర్డర్ కేసులో ముఖ్య పాత్ర పోషించిన నిందితుల వైపు పోలీసుల దృష్టి పడకుండా ఉండేందుకు అతన్ని చంపాలని కక్ష్య పెట్టుకున్న మల్లేశం, మురళీలు ఘటనా స్థలంలో తమకు సంబంధించిన ఆధారాలు లభించే విధంగా వ్యవహరించారు. హత్య జరిగిన ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆనవాళ్లను వదిలివేశారు. దీనివల్ల క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగినా పోలీసులకు అసలు నిందితులు చిక్కే అవకాశం ఉండదని భావించారు. డాగ్ స్క్వాడ్ కూడా మల్లేశం ఇంటి వద్దకే చేరుకోవడం, క్లూస్ టీమ్స్ ఆధారాలు కూడా వీరివైపే చూపిస్తుండడంతో పోలీసులు కూడా మాజీ సర్పంచ్ హత్య కేసులో తండ్రి కొడుకులైన పల్లె మల్లేశం, మరళీలను అనుమానించారు. ఈ మర్డర్ తామే చేశామని ఒప్పుకునేందుకు ఇద్దరు అమాయకులను ఒప్పించిన మురళి వారికి రూ. 3 లక్షల ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో వారితో పాటు మల్లేశంను అరెస్ట్ చేయగా, మురళీ పరారీ అయ్యాడు. అయితే పోలీసులను మాత్రం ఈ ఘటన వెనక ఎదో జరిగిందన్న అనుమానం మాత్రం వెంటాడుతూనే ఉంది. భూ సంబంధిత వివాదాలే సూదుల దేవేందర్ హత్య కేసుకు కారణమైనప్పటికీ నిందితులు మాత్రం వీరిద్దరే కాదని మరి కొందరి పాత్ర ఖచ్చితంగా ఉంటుందన్న కోణంలో ఆరా తీసే పనిలోనే నిమగ్నం అయ్యారు. చివరకు పోలీసులు అనుమానమే నిజం అయింది.

భారీ స్కెచ్…

భూమి కొనుగోలు విషయంలో నెలకొన్న పగను తీర్చుకునేందుకు నిందితుడు పల్లె మురళీ వేసిన స్కెచ్ ఇన్వెస్టిగేషన్ అధికారులను సైతం నివ్వెరపర్చింది. మొదట మాజీ సర్పంచ్ దేవేందర్ ఓ భూమిని కొనేందుకు యజమానికి కొంత నగదు అడ్వాన్స్ ఇచ్చి మిగతా డబ్బులు చెల్లించకుండా హోల్డ్ లో ఉంచాడు. ఈ క్రమంలో మల్లేశం ఆ భూమిని కొనేందుకు ముందుకు రాగా దేవేందర్ భయానా ఇచ్చాడన్న విషయంతో కొంతకాలం లావాదేవీలను నిలిపివేశారు. ఆ తరువాత భూ యజమాని మల్లేశంకు భూమిని అమ్మేందుకు ముందుకు రాగా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తాడు. తాను అడ్వాన్స్ గా ఇచ్చిన భూమిని కొనుగోలు చేసిన మల్లేశంపై కక్ష్య పెంచుకున్న మాజీ సర్పంచ్ ఓ సారి హత్యయత్నానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. దీంతో తనను చంపేందుకు దేవేందర్ పక్కా ప్లాన్ వేశాడని గమనించిన మల్లేశం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తాడు. అయితే తన తండ్రిని చంపేందుకు విఫలయత్నం చేసిన మాజీ సర్పంచ్ దేవేందర్ ను మట్టుబెట్టేందుకు మురళీ పథకం పన్నాడు. తన తండ్రికి కూడా తెలియకుండా వేసుకున్న ప్లాన్ అమలు చేసి దేవేందర్ ను హత్య చేయించాడు.

సుపారి గ్యాంగ్…

ఇకపోతే ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన సుపారి గ్యాంగును హైర్ చేసుకున్న మురళీ రూ. 30 లక్షల డీల్ కుదుర్చుకుని రూ. 14 లక్షల అడ్వాన్స్ గా చెల్లిస్తాడు. కారు కొనుగోలు చేసుకునేందుకు రూ. 3 లక్షలు కూడా ఇస్తాడు. హైదరాబాద్ కు చెందిన వీరితో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత తమ టార్గెట్ రీచ్ అయ్యేందుకు సూపారి గ్యాంగ్ తో కలిసి భారీ పథకం వేశాడు. సూపారి గ్యాంగ్ దేవేందర్ ను హత్య చేసేందుకు రంగంలోకి దిగిందన్న విషయం ఏ మాత్రం లీకయినా టార్గెట్ రీచ్ కాలేమని భావించి వారిని రియాల్టర్లుగా దేవేందర్ ను పరిచయం చేసుకోవాలని సూచిస్తాడు. హైదరాబాద్ గ్యాంగ్ పక్కా ప్లాన్ వేసుకుని మాజీ సర్పంచ్ తో స్నేహం పెంచుకుని రియల్ వ్యాపారం కోసమే వచ్చినట్టుగా నమ్మిస్తారు. ఈ క్రమంలో వీరు రెగ్యూలర్ గా విందులు, వినోదాలు కూడా చేసుకుంటూ రియాల్టర్లమనే నమ్మకం బలపడే విధంగా వ్యవహరించారు. అయితే దేవేందర్ తో కొత్త వ్యక్తులు కలిసి తిరుగుతున్న విషయం తెలిసిన మల్లేశం… పలు సందర్బాల్లో కొడుకు మురళీతో తనను హత్య చేసేందుకు మాజీ సర్పంచ్ పథకం పన్నాడని ఆందోళన వ్యక్తం చేస్తాడు. మురళీ మాత్రం అలాంటిదేమీ లేదు లే నాన్న అంటూ దాటవేశాడు తప్ప మర్డర్ కోసం వేసిన స్కెచ్ గురించి లీక్ మాత్రం చేయలేదు. ఒకటి రెండు సార్లు ఆగ్రహంతో ఊగిపోయిన మల్లేశం, దేవేందర్ పై ప్రతీకారం తీసుకోవాలని అక్కసు వెల్లగక్కినా మురళీ మాత్రం అదే పనిలో ఉన్నానంటూ దాటవేత ధోరణి అవలంభించాడు కానీ… దేవేందర్ చుట్టూ తిరుగుతున్న వారంతా తాను ఏర్పాటు చేసిన సూపారి గ్యాంగ్ అన్న విషయాన్ని మాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.

ములాఖత్ తో…

గత నెలలో దేవేందర్ హత్య తరువాత కూడా సుపారి గ్యాంగ్ కూడా తమపై అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. దేవేందర్ అంత్యక్రియల తంతు నుండి పెద్ద కర్మ వరకు కూడా అతని ఇంటికి వస్తూ పోతుండడంతో వారిపై ఎలాంటి అనుమానం రాలేదు. దేవేందర్ స్నేహితులమైనందునే అతని హత్య తరువాత కూడా వచ్చామన్న నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. కానీ డామిట్ కథ ఇక్కడే అడ్డం తిరిగింది అన్నట్టుగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మురళీ నేరుగా కోర్టులో లొంగిపోయిన తరువాత కస్టడీకి తీసుకుని పోలీసులు విచారిస్తారు. ఈ మర్డర్ తామే చేశామని ఇందులో వేరే వారి ప్రమేయం ఏ మాత్రం లేదని పోలీసులకు మురళీ తేల్చి చెప్పాడు. కస్టడీ ముగిసిన తరువాత మురళీని ఖమ్మం జైలులో దేవేందర్ సన్నిహితులుగా వ్యవహరించి రియాల్టర్ల ముసుగులో ఉన్న సూపారి గ్యాంగ్ ములాఖత్ కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మృతుడు, నిందితుల కాల్ డాటా రికార్డ్ సేకరించిన పోలీసులకు అసలు విషయం అర్థం అయింది. మర్డర్ స్కెచ్ లో భాగంగానే రియాల్టర్ల రూపంలో సూపారి గ్యాంగ్ ను దేవేందర్ వద్దకు ఎంట్రీ చేయించి పకడ్భందీగా వ్యవహరించాడని తేల్చారు. దీంతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులు అసలు విషయాన్ని రూఢీ చేసుకుని అరెస్ట్ చేశారు.

నిందితుల అరెస్ట్

మాజీ సర్పంచ్ దేవేందర్ ను జులై నెలలో సుత్తెతో కొట్టి చంపిన ఘటనలో నిందితులు తప్పించుకున్నా పోలీసులు మాత్రం వదిలిపెట్టలేదు. ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని కాలంలోనే క్రైం ఇన్వెస్టిగేషన్ విషయంలో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులకు ఆధునిక కాలంలో చిక్కకుండా ఉంటామని భ్రమించిన నిందితులు చివరకు కటకటాల పాలయ్యారు. వృత్తిరిత్యా ఎన్నో రకాల కేసుల అనుభవాలను చవి చూసిన పోలీసులకు నిందితులపై అనుమానం రాదని గుడ్డిగా నమ్మారు కానీ చివరకు అరెస్ట్ కాక తప్పలేదు. ఈ కేసులో నిందితులైన ఏపీలోని ప్రకాషం జిల్లా గిద్దెలురు మండలం నడిమెట్లకు నివాసి ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని చిన్న చెర్లపల్లిలో నివసిస్తున్న సుంకర ప్రసాద్ రెడ్డి అలియాస్ ప్రసాద్ నాయుడు, అలియాస్ ఆళ్లగడ్డ ప్రసాద్, అలియాస్ వెంకట ప్రసాద్(52), వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బుర్హాన్ పల్లి నివాసి, ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లిలో ఉంటున్న పల్లె ముఖేష్ (28), నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం దామెర భీమన్ పల్లి, కమ్మ గూడెం నివాసి, ప్రస్తుతం కాప్రా మండలం వైఎస్సాఆర్ నగర్, జవహర్ నగర్ కు చెందిన మార్నేని రాజు (46), నారాయణ్ పేట జిల్లా అభాంగాపూర్ కు చెందిన కర్ణోల్ల కృష్టయ్య (47)లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పల్లె మల్లేశం, పల్లె మురళీలతో పాటు మరో ఇద్దరు నేరంతో సంబంధం లేకున్నా తమపై వేసుకుని మరీ అరెస్ట్ అయ్యారు. నిందితుల నుండి ఓ షిప్ట్ డిజైర్ కారు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ అంబటి నర్సయ్య ఈ మేరకు నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు.

You cannot copy content of this page