దగ్గరుండి పర్యవేక్షించిన ఎస్సీ గౌష్ ఆలం
సురక్షితంగా 80 మంది తరలింపు
దిశ దశ, ములుగు:
బుధవారం రాత్రి 100 డయల్ కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సార్ మేమంతా ములుగు జిల్లా ముత్యాలదార సమీపంలోని అటవీ ప్రాంతంలో చిక్కుకున్నాం… మార్గమధ్యలో వాగు పొంగిపొర్లుతోంది… మమ్మల్సి కాపాడండి అంటూ అభ్యర్థించాడు. వెంటనే ములుగు ఎస్పీ గౌష్ ఆలంకు 100 డయల్ నుండి పోన్ కాల్ రాగానే ఆయన అలెర్ట్ అయి జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు. వెంటనే కార్యరంగంలోకి దిగి 80 మంది వరకు ఉన్న వారందరిని కాపాడాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు ఫోన్ చేసి మనో నిబ్బరంగా ఉండాలని… రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశామని ధైర్యం చెప్పారు ఎస్పీ. ఆ తరువాత వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులంతా క్షేమంగా గమ్యం చేరేవరకూ అక్కడే ఉన్నారు.
80 మంది కోసం 50 మంది రెస్క్యూ…
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ముత్యాలదార జలపాతంను చూసేందుకు వెల్లిన 80 మంది పర్యాటకులను కాపాడేందుకు 50 మంది రెస్క్యూ టీంను రంగంలోకి దింపారు. ఖమ్మం, హనుమకొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు కు చెందిన ఈ టూరిస్టులను కాపాడేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, NDRF టీమ్స్ రంగంలోకి దింపి స్థానిక సీఐ, ఎస్సైలను వాగువద్దనే ఉండి పరిస్థితిని సమీక్షించాలని ఎస్పీ గౌష్ ఆలం ఆదేశించారు. అంతేకాకుండా ఆయన కూడా ఘటనా స్థలం వద్దకు చేరుకుని బాధితులంతా కూడా క్షేమంగా బయటకు వచ్చే వరకూ వేచి ఉన్నారు. తెల్లవారు జామున 3.30 గంటలకు బాధితులంతా కూడా వాగు దాటడంతో బాధితులతో పాటు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకుంది. వరద ఉధృతి తీవ్రంగా ఉన్నప్పటికీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సేఫ్టీ మేజర్స్ తీసుకుని ముత్యాలదార వైపు చిక్కుకుని ఉన్న టూరిస్టులను కాపాడడంలో సఫలం అయ్యారు. కమ్ముకున్న చీకట్లలో వాహనాల లైట్లు, మొబైల్స్ సెర్చ్ లైట్ల సాయంతో భారీ సాహసం చేశారనే చెప్పాలి. ఎగువ ప్రాంతం నుండి క్షణక్షణం పెరుగుతున్న ప్రవాహంలోనూ తమ ప్రాణాలను కాపాడుకుంటూ బాధితులను క్షేమంగా బయటకు తీసుకరావడంలో సక్సెస్ అయ్యారు. బాధితులకు అవసరమైన మెడిసిన్స్ తో పాటు ఆహారం కూడా ములుగు జిల్లా అధికార యంత్రాంగం అందజేసి వారికి బాసటగా నిలిచింది. టూరిస్టుల్లో అంతా యువకులే ఉండడం మహిళలు, చిన్న పిల్లలు లేకపోవడం కూడా రెస్క్యూ ఆపరేషన్ కు సులువుగా కంప్లీట్ అయిందని చెప్పవచ్చు. ఘటనా స్థలంలో ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, వెంకటాపురం సీఐ కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతిలు బాధితులను సేఫ్ చేసే వరకూ ఉన్నారు.