దిశ దశ, సినిమా:
కొంతకాలంగా సాన్నిహిత్యంగా ఉంటున్న చైతు… శోభితలు ఏడడుగులు, మూడు ముళ్ల బంధంతో దాంపత్య జీవనంలోకి అడుగు పెట్టబోతున్నారు. గురువారం అక్కినేని నాగార్జున ఇంట్లో నాగ చైతన్య, శోభితల నిశ్చితార్థం తంతు పూర్తయింది. సమంతతో డైవర్స్ ఇచ్చిన తరువాత చైతు వివాహం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అయితే అందించింది నాగార్జున ఫ్యామిలీ. కొద్ది సేపటి క్రితం నాగార్జున ‘ఎక్స్’ వేదికగా చైతు, శోభితల ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. శోభితను తమ ఇంటికి మనస్పూర్థిగా ఆహ్వానిస్తున్నాము అంటూ నాగార్జున పేర్కొన్నారు.
ముహూర్త బలం…
అయితే చైతు, శోభితల ఎంగేజ్ మెంట్ విషయంలో పండితులను చర్చలు జరిపి బలమైన ముహూర్తాన్నే ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 8న నిశ్చితార్థం పెట్టుకుంటూ మంచిదని అక్కినేని కుటుంబ పండితులు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. 08.08.2024 తేది అంటే 8.8.8గా అవుతోందని దీనివల్ల ఈ దంపతులు ఇద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో గడుపుతారని పండితులు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే గురువారం ఉదయం 9.42 గంటలకు నాగార్జున ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిపించారన్న చర్చ జరుగుతోంది. అయితే వీరిద్దరి వివాహం డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని, ప్రస్తుతం చైతు ‘‘తండేల్’’ మూవీ షూటింగ్ బీజీలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివర్లో పూర్తి కానుంది.