అప్పుడే నాలా పర్మిషన్ వస్తే… మళ్లీ పైల్ ఎందుకు మూవ్ అయింది..?

చల్మెడ భూముల వెనక అసలేం జరిగింది..?

దిశ దశ, కరీంనగర్:

ల్మెడ హస్పిటల్ నిర్మాణం జరిగిన భూములకు అసలు ‘‘నాలా’’ పర్మిషన్ వచ్చిందా..? ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారా..? మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అనుమతుల కోసం యాజమాన్యం దృవీకరణ పత్రాలు సంబంధిత విభాగాలకు ఎలా సబ్మిట్ చేసింది..? ఇప్పుడివే ప్రశ్నలు అటు అధికారులను ఇటు సామాన్యులను వెంటాడుతున్నాయి.

2001లోనే…

నాలా సెస్ చెల్లించే విషయంలో ఒకే నంబర్ పై అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ, గురు రాందాస్ ఎడ్యూకేషన్ సొసైటీలకు వేర్వేరు ప్రొసిడింగ్స్, వేర్వేరు తేదిలలో వచ్చాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇదే 2001లో అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ చేసిన దరఖాస్తు ఫైలుపై 2008లో రెవెన్యూ అధికారుల మధ్య అంతర్గతంగా జరిగిన కరస్పాండెన్స్ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. 2001లోనే నాలా అనుమతులు తీసుకుని అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ నిర్మాణాలు జరిపినట్టుగా రికార్డులు చెప్తున్నాయి. D1/5033/2000 నంబర్ పై గురు రాందాస్ సొసైటీకి 31 అక్టోబర్ 2000లో అధికారులు నాలా అనుమతులు ఇచ్చినట్టుగా ప్రొసిడింగ్స్ జారీ అయ్యాయి. D1/5033/2001 నంబర్ పై అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీకి జనవరి 3 2001న నాలా అనుమతులు ఇచ్చినట్టుగా ప్రొసిడింగ్స్ విడుదల అయినట్టుగా సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు తెలిపారు. ఈ అనుమతులతోనే అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ నిర్వాహకులు చల్మెడ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణాలు చేసినట్టుగా స్పష్టం అవుతోంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే… ఒకే నెంబర్ పై రెండు ప్రొసిడింగ్స్ వేర్వేరు సొసైటీలకు విడుదల కావడమే.

బిగ్ ట్విస్ట్…

ఇదే రెవెన్యూ అధికారులు ఇచ్చిన రికార్డులను సునిశితంగా పరిశీలించినప్పుడు బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ జనవరి 3 2001న చేసుకున్న దరఖాస్తు ఆధారంగా రెవెన్యూ అధికారులు 2008లో మరో ఫైల్ మూవ్ చేశారు. అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ బొమ్మకల్, దుర్శేడ్ రెవెన్యూ గ్రామాల్లోని పలు సర్వే నంబర్ల భూములను నాలా కన్వర్షన్ కింద మార్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఆర్డీఓల నిర్దేశాన్ని అనుసరించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశామని అప్పటి తహసీల్దార్ ఓ నివేదిక ఇచ్చారు. 25 జూన్ 2008న కరీంనగర్ తహసీల్దార్ కార్యాలయం నుండి విడుదల అయిన ఈ లేఖలో D1/5033/2000 ప్రొసిడింగ్ పొందినట్టుగా వివరించారని అయితే సదరు సొసైటీ ద్వారా నాలా చెల్లించలేదని వివరించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… రెవెన్యూ అధికారులు ఇచ్చిన డాక్యూమెంట్లలోనే అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ 2001లో ప్రొసిడింగ్స్ అందుకున్నట్టుగా ఉంటే 2008లో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో మాత్రం 2000 సంవత్సరంగా పేర్కొనడం గమనార్హం. ఇదే లేఖలో తహసీల్దార్ కార్యాలయం వివరిస్తూ జనవరి 3 2001న ఇచ్చిన ప్రొసిడింగ్ ను సవరించాలని కోరారని ఈ ప్రొసిడింగ్ మాత్రం 2001 ద్వారా జారీ చేశారని పేర్కొన్నారు.

అది సీలింగ్ ల్యాండే..

బొమ్మకల్ శివార్లలోని 114, 115 సర్వే నంబర్లలని కొంత భూమి సీలింగ్ పరిధిలో ఉందని కరీంనగర్ LRATలో కేసు పెండింగ్ లో ఉందని కూడా ఇదే లేఖలో అప్పటి తహసీల్దార్ వివరించారు. అలాగే అప్పటి వరకు అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ నాలా సెస్ చెల్లించలేదని, ఇదే భూమిలో పారా మెడికల్ కోర్సులు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని కూడా తెలిపారు. కరీంనగర్ కలెక్టర్ NOTE: D1/3064/2008, 5 JUNE 2008 మేరకు తహసీల్దార్ ను నివేదిక అడగగా కరీంనగర్ తహసీల్ కార్యాలయం నుండి Lr NO: B1/1724/2008 23 JUNE 2008న వచ్చిన నివేదిక ఆధారంగా కరీంనగర్ ఆర్డీఓ 2008 జూన్ 24న జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించినట్టుగా స్పష్టంగా పేర్కొన్నారు. సీలింగ్ యాక్టు అమల్లో ఉన్నదని ఆర్డీఓ, తహసీల్దార్లు కలెక్టర్ కు పంపిన నివేదికలో వివరించడం మరో విశేషం.

రెండు సార్లు…

అయితే ఇక్కడ రెవెన్యూ అధికారులు అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ సీలింగ్ భూముల్లో నిర్మాణాలు జరిపినట్టుగా రెవెన్యూ అధికారులు రెండు సార్లు క్షేత్ర స్థాయిలో జరిపిన విచారణలో తేల్చినట్టుగా స్పష్టం అవుతోంది. జగిత్యాల సీలింగ్ ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు 30 ఆగస్టు 2006లో అప్పటి రెవెన్యూ అధికారులు ఈ భూములను పంచనామా చేశారు. సీలింగ్ పరిధిలో ఉన్న భూముల్లో సాగవుతున్న విషయాన్ని గమనించి పంటలను విక్రయించి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలన్న ఆధేశాల మేరకు అధికారులు గ్రౌండ్ రిపోర్టు కోసం వెళ్లారు. ఈ సమయంలో కూడా సీలింగ్ పరిధిలో ఉన్న భూముల్లో అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. తిరిగి 2008లో కరీంనగర్ తహసీల్దార్ ఆర్డీఓకు పంపిన రిపోర్టులో కూడా సీలింగ్ భూములేనని తేల్చారు. 2006, 2008లో అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ నిర్మాణాలు ఉన్న భూమి సీలింగ్ పరిధిలో ఉందని తేల్చినప్పుడు కూడా రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నదే పజిల్ గా మారింది.

చర్యలేవి మరి..?

అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట 2001లో విడుదల అయిన ప్రొసిడింగ్స్ విషయంలో శాఖాపరంగా రెవెన్యూ అధికారులు ఎందుకు విచారణ జరపలేదన్నదే అంతు చిక్కకుండా పోతోంది. సదరు సొసైటీ నుండి నాలా సెస్ రెవెన్యూ విభాగానికి అందలేదని తేల్చినప్పుడు 2001లో విడుదలైన ప్రొసిడింగ్స్ వెనక ఏం జరిగింది అన్న కోణంలో విచారణ చేసేందుకు అప్పటి అధికారులు చొరవ తీసుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. మరో వైపున 2001లో ఈ సొసైటీకి నాలా అనుమతులు ఇస్తూ విడుదల అయిన ప్రొసిడింగ్స్ డేట్, 2008లో తహసీల్దార్ ఇచ్చిన నివేదికలో నాలా కోసం దరఖాస్తు చేసుకున్న తేది ఒకటే తేది ఉండడం విశేషం.

డాక్యూమెంట్లు వెరిఫై చేయాలి: బండారి శేఖర్

రెవెన్యూ అధికారుల సమాచార హక్కు చట్టం ప్రకారం ఇచ్చిన రికార్డులు పరిశీలిస్తే అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ పేరిట నిర్వహిస్తున్న చల్మెడ హస్పిటల్, కాలేజీ కోసం నిర్వాహాకులు మెడికల్ కౌన్సిల్ తో పాటు సంబంధిత విభాగాలకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ అంటున్నారు. రెవెన్యూ అధికారులే నాలా సెస్ సదరు సొసైటీ చెల్లించలేదని 2008లో ఇచ్చిన రిపోర్టులో తేల్చి చెప్పారని, అయితే 2001లోనే నాలా అనుమతులు తీసుకున్నట్టుగా ఇచ్చిన ప్రొసిడింగ్స్ అసలైనవా కావా అన్న అనుమానం కలుగుతోందన్నారు. మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అనుమతుల కోసం నిర్వాహకులు చేసుకున్న దరఖాస్తుతో పాటు పొందుపర్చిన ప్రతి సర్టిఫికెట్ ను కూడా సేకరించి పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఒకవేళ అరియంత్ ఎడ్యూకేషన్ సొసైటీ నిర్వాహకులు తప్పుడు డాక్యూమెంట్లు సృష్టించినట్టయితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బండారి శేఖర్ డిమాండ్ చేశారు. అలాగే రెవెన్యూ విభాగంలో ఒకే సంస్థకు సంబంధించిన ఫైల్ వేర్వేరు సందర్భాల్లో మూవ్ అయినా రెఫరెన్సులు కూడా ఊటంకించినప్పుడు కూడా తప్పిదాలను గమనించలేదన్నారు. దీనిని బట్టి రెవెన్యూ అధికార యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా స్పష్టం అవుతోందన్నారు. సీలింగ్ భూముల్లో కాలేజీ నిర్మాణాలు ఉన్నాయని రెండు సార్లు నిర్దారించినప్పటికి చర్యలు తీసుకోకపోవడంతో పాటు నాలా సెస్ విషయంలో వెలుగులోకి వచ్చిన తప్పిదాలపై విచారణ జరిపి రెవెన్యూ యంత్రాంగంపై కూడా చర్యలు తీసుకోవాలని బండారి శేఖర్ కోరారు. ఈ అంశాలన్నింటిపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, కాళోజీ మెడికల్ యూనివర్శిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

You cannot copy content of this page