లోకేష్ వర్సెస్ ఏపీ సీఐడీ
దిశ దశ, ఏపీ బ్యూరో:
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అంశం దేశ రాజధాని కేంద్రంగా సమీకరణలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత జైలు జీవితం అనుభవిస్తుండడంతో ఆయన తనయుడు నారా లోకేష్ ఢిల్లీకి వెల్లి తన గళాన్ని వినిపించడంతో పాటు ఈ అంశాన్ని జాతీయ స్థాయి చర్చకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో మునిగిపోయారు. చంద్రబాబు అరెస్ట్, జ్యూడిషియల్ రిమాండ్ తరువాత ఢిల్లీకి వెల్లిన లోకేష్ టీడీపీ పార్లమెంటరీ వ్యవహారాలను సమీక్షించడంతో పాటు వివిధ పార్టీల జాతీయ నేతల మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజల ముందు ఉంచేందుకు యత్నిస్తున్నారు. లోకేష్ ఢిల్లీలోనే ఉంటూ మంత్రాంగం నెరుపుతుండడంతో అసలేం జరుగుతోంది అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైళ్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు ఆహారం అందించేందుకు ఆయన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణీలు అక్కడ ఉండగా, పార్టీ వ్యవహారాలపై బాలకృష్ణ దృష్టి సారించారు. ఇకపోతే స్థానికంగా గళాన్ని వినిపించేందుకు ప్రత్యేకంగా ఏపీలో ముఖ్య నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది ముఖ్య నేతల పేర్లు కూడా ఉండడం కూడా టీడీపీ నేతలకు మింగుడు పడకుండా తయారైందని చెప్పవచ్చు. అయితే ఢిల్లీ కేంద్రంగా నారా లోకేష్ ఏం చేస్తున్నారన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు, భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు ఏంటీ అన్న విషయాలపై నిఘా వర్గాలు ప్రత్యేకంగా తెలుసుకునే పనిలో పడ్డాయి.
ఇటు సీఐడీ…
ఇకపోతే ఏపీ సీఐడీ అధికార యంత్రాంగం కూడా న్యూ ఢిల్లీ కేంద్రంగానే సమీకరణాలు చేయడం ఆరంభించారు. ఇప్పటికే సీఐడీ అధికారులు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. తాజాగా మరోసారి ఏపీ సీఐడీ బృందం ఢిల్లీకి వెల్లనుందన్న ప్రచారం ఊపందుకుంది. స్కిల్ స్కాం కేసులో నిందితునిగా ఉన్న నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇంతకు ముందు కూడా లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆయన రాజమండ్రి చేరుకుంటేనే సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకున్నారంతా. కానీ అనూహ్యంగా నారా లోకేష్ కోసం ఏపీ సీఐడీ టీమ్ ప్రత్యేకంగా ఢిల్లీ వెల్తోందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండడంతో అసలేం జరుగుబోతోందన్న హాట్ టాపిక్ మొదలైంది. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తో పాటు మరో ఎస్పీ సరిత, ఇద్దరు సీఐలు, నలుగురు కానిస్టేబుల్స్ ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అయితే వీరు సుప్రీం కోర్టు లీగల్ టీంతో కూడా చర్చిస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే లోకేష్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఇప్పటికే ఏసీ సీఐడీ టీం అక్కడకు వెల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తాజాగా మరోసారి కూడా దేశ రాజధానికి వెల్తున్న నేపథ్యంలో వారు న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెల్తున్నారా లేక మరోసారి లోకేష్ కు కౌంటర్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా..? ఆయన్ని నిజంగానే అరెస్ట్ చేస్తారా అన్న విషయంపై మాత్రం స్పష్టత రావడం లేదు. ఏపీ సీఐడీ టీమ్ మాత్రం నేడు లేదా రేపు ఢిల్లీకి పయనం కానున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా స్కిల్ స్కాం వ్యవహారం మాత్రం ఏపీ నుండి ఢిల్లీకి చేరుకుందన్నది వాస్తవం.