ఆయన ఇంటి పేరే ’షికార్‘… మళ్లీ దొరికిన సత్యం…

మహదేవపూర్ దుప్పుల వేట కేసులో నిందితుడు

తనయుడు పోలీసు అధికారితండ్రి వేటగాడు…

దిశ దశ, జగిత్యాల:

జాతీయ పక్షి నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిపేరే షికార్ అన్న బిరుదును తెచ్చుకున్న ఘరానా హంటర్ అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కాడు. గతంలో దుప్పుల వేట కేసులో నిందితునిగా ఉన్నప్పటికి తన వ్యాపకం నుండి మాత్రం బయటపడలేదు. ములుగు జిల్లాలో పని చేస్తున్న డీఎస్పీకి ఈయన తండ్రి కావడం మరో విశేషం. జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. జిల్లాలోని పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నెమళ్లను వేటాడి తన వాహనంలో తీసుకొస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో విచారించారు పోలీసులు. మండలంలోని దోమలకుంట సమీపంలో నెమళ్లను వేటాడిన వాటిని తీసుకుని తన స్వగ్రామానికి వెల్తుండగా పోలీసుల తనిఖీల్లో రెడ్ హైండడ్ గా పట్టుబడ్డాడు. నిందితుని నుండి 0.22 ఎంఎం ఆయుధం, 34 రౌండ్ల తూటాలు, ఒక గొడ్డలి, కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణ గతంలో పెద్దపల్లి జిల్లా బేగంపేట ప్రాంతంలో నివాసం ఉంటూ సింగరేణిలో ఉద్యోగం చేసేవాడు. 2017లో రాష్ట్రంలోనే సంచలనం కల్గించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వాయిపేట శివార్లలో దుప్పుల వేట ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో దుప్పులను వేటాడుతున్న క్రమంలో అటవీ అధికారులు దాడులు చేయడం… సినిమా ఫక్కీలో వేటగాళ్లు తప్పించుకోవడంతో వేటకు బలైన దుప్పులను, కారును స్వాధీనం చేసుకున్నారు అటవీ అధికారులు. ఆ తరువాత పోలీసు అధికారులు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న క్రమంలో షికార్ సత్యం కూడా ఈ కేసులో ఉన్నాడని గుర్తించారు. అప్పుడు భూపాలపల్లి ఉమ్మడి జిల్లాలోనే షికార్ సత్యం తనయుడు సీఐగా పనిచేస్తున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ ఈ కేసును సీరియస్ గా తీసుకుని శాసనసభ పక్ష నేతగా ఉన్న జి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు అటవీ అధికారుల తీరుపై కూడా బీజేపీ ఎమ్మెల్యేలంతా ముక్త కంఠంతో ఆరోపించడంతో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో మహదేవపూర్ ప్రాంతానికి చెందిన వారితో పాటు షికార్ సత్యం కూడా ఉన్నాడని వెలుగులోకి వచ్చింది. తాజాగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద వాహనాల తనిఖీలో జాతీయ పక్షి నెమళ్లను వేటాడి పట్టుకొస్తూ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో నివాసం ఉంటున్న ఆయన వద్ద అనుమతి లేకుండా వినియోగిస్తున్న తుపాకితో జాతీయ పక్షులను వేటాడుతున్నట్టు తేటతెల్లమైంది. అయితే షికార్ సత్యం తనయుడు పోలీసు విభాగంలో డీఎస్పీ స్థాయిలో పనిచేస్తున్నట్టుగా సమాచారం. ఆయన నక్సల్స్ ఏరివేతలో క్రియాశీలకంగా పనిచేసి ఆక్సిలరీ ప్రమోషన్ పొందాడని పోలీసు వర్గాల సమాచారం.

మొదటి సారా..?

అయితే షికారి సత్యం దోమలకుంటలో వన్యప్రాణులను వేటాడడం ఇదే తోలిసారా గతంలోనూ ఈ ప్రాంతంలో హంటింగ్ చేశాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతంలో గుట్టలు విస్తరించి ఉండడంతో వన్యప్రాణులు అక్కడే అయితే దొరుకుతాయని గుర్తించిన సత్యం ఆ ప్రాంతంలో ఆరా తీసి ఉంటాడని భావిస్తున్నారు. ఎక్కడో అటవీ ప్రాంతాల చుట్టూ తిరగడం కంటే తన స్వగ్రామానికి సమీపంలోనే వన్యప్రాణులు అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతంలో షికార్ చేసి ఉంటాడని తెలుస్తోంది. అయితే షికార్ సత్యం ఈ ప్రాంతంలో వేటాడడం ఇదే తొలిసారా లేక గతంలోనూ హంటింగ్ చేసి ఉంటాడా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది.

ఎవరి కోసమో…

సొంతగా బర్మర్లు కూడా తయారు చేయగల సత్తా ఉన్న షికార్ సత్యం రన్నింగ్ వాహనంలో ట్రావెల్ చేస్తూ వన్యప్రాణులను వేటాడడంలో దిట్ట అని కూడా ప్రచారంలో ఉంది. గురి తప్పకుండా పరిగెత్తే ప్రాణులను వాహనంలో వెంటాడి వేటాడడంలో అత్యంత నిపుణుడని కూడా తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన నెమళ్లను వేటాడానికి అసలు కారణం ఏంటన్న విషయం కూడా తేలాల్సి ఉంది. సాధారణంగా దుప్పులు, జింకలు వంటి ప్రాణులను వేటాడి గిఫ్ట్ ప్యాక్ పంపిచే ఆనవాయితీ కూడా ఈయనకు ఉందని, ఎక్కువగా అలాంటి ప్రాణులనే టార్గెట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ సారి ఆయన నెమళ్లను వేటాడి చంపారంటే ఇవి ఆయన కోసమేనా లేక వేరే వారి కోసమా అన్న చర్చ మొదలైంది. హంటింగ్ లో నిపుణుడిగా పేరు గాంచిన షికార్ సత్యంను చాలా మంది సంప్రదింపులు కూడా చేస్తుంటారని దుప్పుల కేసప్పుడే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా నెమళ్లను వేటాడారంటే ఎవరో బిగ్ షాట్స్ తమకు కావాలని అడిగి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో అటవీ అధికారులు కూడా ఎంట్రీ ఇచ్చి వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినట్టయితే మరిన్ని వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహదేవపూర్ దుప్పుల కేసులో అరెస్ట్ అయిన తరువాత షికార్ సత్యం వేటను మానేయకపోవడం కూడా ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

You cannot copy content of this page