దండకారణ్యంలో తిరంగా రెపరెపలు…

నాడు నల్ల జెండాలతో నిరసన…

నేడు త్రివర్ణ పతాక ఆలంబన

దిశ దశ, దండకారణ్యం:

క్రాంతికారీ జనతన్ సర్కార్ ఇలాకాలోని కొన్ని ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలు అనగానే అన్నలు నల్ల జెండాలు ఎగురవేయాలని పిలుపునిస్తూ ఎర్రటి బ్యానర్ల ద్వారా ప్రచారం చేసే వారు. అక్కడి మావోయిస్టుల ఖిల్లా ప్రభుత్వ వ్యతిరేక నిరసన నినాదాలతో హోరెత్తిపోయేది. అదే అటవీ ప్రాంతంలోకి క్రమక్రమంగా పోలీసు బలగాలు లక్ష్యం సాధించేందుకు చొచ్చుకపోతున్నాయి. తాజాగా అడవి బిడ్డలతో జాతీయ జెండాలు ఎగురవేయించి జనగణమన గీతాలాపన చేయించడంలో సక్సెస్ అయ్యారు. చత్తీస్ గడ్ లోని బస్తర్ పూర్వ జిల్లా ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు తమ ఆధీనంలోకి తీసుకుని సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏరియాలోకి బలగాలు మావోయిస్టులపై పై చేయి సాధించేందుకు ఓ వైపున సాయుధ పోరు సాగిస్తూనే మరో వైపున జాతీయ భావ జాలాన్ని నింపే పనిలో కూడా నిమగ్నం అయ్యారు. ఇందులో భాగంగా గత జనవరి 26 నుండి ‘‘త్రివేణీ’’ కార్యాచరణ ప్రణాళిక పేరిట అక్కడి అడవి బిడ్డలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దండకారణ్య అటవీ ప్రాంతంలోని ఆదివాసి బిడ్డలను అక్కున చేర్చుకుంటూ జాతీయ భావజాలాన్ని కూడా నిర్మాణం చేయాలన్న సంకల్పంతో పోలీసులు వ్యూహాత్మక ఎత్తులు వేయడం ఆరంభించారు. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న బస్తర్ రేంజ్ పోలీసులు… నిన్నటి వరకూ లాల్ సలామ్ అని నినదించిన గొంతుకలచే భారత్ మాతాకీ జై అన్న పదం పలికించగలుగుతున్నారు.

మువ్వన్నెల జెండా…

పచ్చని అడవులు, గుట్టలు విస్తరించి ఉన్న దండకారణ్యంలో జాతీయ జెండాలు ఎగురవేయించడంలో సఫలీకృతం అవుతున్నారు. బస్తర్ ప్రాంతంలోని చిన్నగేలూరు, తిమ్నార్, తొండమార్క, డబ్బామార్క తదితర కీకారణ్యాల్లో జాతీయ జెండా పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుక్మా జిల్లాలోని సిల్గర్ నాలా, బీజాపూర్ లోని బెద్రే, తొండమార్క, డబ్బమార్క చిన్నగేలూర్, తిమ్నార్, హిరోలి, కంకేర్ జిల్లాలోని మన్హకల్ తదితర ప్రాంతాలోల్ కొత్తగా శిబిరాలు ఏర్పాటు చేయడంలో బస్తర్ రేంజ్ పోలీసులు సఫలం అయ్యారు. ‘‘త్రివేణి’’ కార్యాచరణ ప్రణాళిక ద్వారా స్థానిక ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేలా చేయడంలో బలగాలు సక్సెస్ అయ్యాయి. కొన్ని క్యాంపుల వద్ద అక్కడి ఆదివాసీలచే పతాకావిష్కరణలు కూడా చేయించిన బలగాలు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాయి. ఈ సందర్భంగా ఆయా శిబిరాల్లో పతాకావిష్కరణ అనంతరం పోలీసు అధికారులు ప్రసంగిస్తూ బస్తర్ అటవీ ప్రాంతంలో వామపక్ష తీవ్రవాదాన్ని త్వరలోనే అంతం చేసి ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని ప్రకటించారు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి తీసుకుంటున్న నిర్ణయాల మేరకు నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేస్తూ అటవీ ప్రాంతాల అభివృద్దికి అన్ని వేళల్లో కృషి చేస్తామన్నారు.

You cannot copy content of this page