వనాల నడుమ నాడు… వాహనాల నడుమ నేడు…

కాలి నడక ప్రయాణమే దిక్కా..?

కాళేశ్వరా కరుణించుమా..!

దిశ దశ, భూపాలపల్లి:

తలాపునా గోదావరి నది ఉందన్న సంబరం కంటే… ఇసుక రవాణాతో పడుతున్న బాదలే ఎక్కువయ్యాయి ఆ ప్రాంత వాసులకు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బముబ్బడిగా ఇసుక రీచులను ఏర్పాటు చేయడంతో లారీల రాకపోకలతో గోదావరి తీరమంతా కిక్కిరిసిపోతున్నది. నేషనల్ హైవేపై ఇసుక లారీలు పార్కింగ్ చేస్తుండడంతో సామాన్యులు నరకం చవి  చూస్తున్నారు. జిల్లాలోని మహదేవపూర్ మండలం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నది తీరంలో పెద్ద ఎత్తున ఇసుక రీచులను ఏర్పాటు చేసిన TGMDC ఇసుక రవాణకు అనుమతి ఇస్తోంది. దీంతో పల్గుల నుండి అంబట్ పల్లి వరకు ఉన్న రహదారలన్ని కూడా ఇసుక లారీల రాకపోకలు సాగుతున్నాయి.

అరుదైన క్షేత్రం…

దేశంలోనే అత్యంత అరుదైన క్షేత్రంగా భాసిల్లుతున్న కాళేశ్వరానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రైవేటు వాహనాల్లో, ఆర్టీసీ బస్సుల్లో కాళేశ్వరం వెల్లే భక్తులతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న వివిధ గ్రామాల ప్రజలు ట్రాఫిక్ జామ్ వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక లారీలను నేషనల్ హైవేపైనే పార్కింగ్ చేస్తుండడంతో ఈ రోడ్డు సింగిల్ రోడ్డును మరిపిస్తోంది. ప్రధాన రోడ్డుకు ఓ వైపున ఇసుక లారీల పార్కింగ్, మరో వైపున ఇసుక తరలించే లారీల రాకపోకలు సాగిస్తుండడంతో సామాన్యులు ప్రయాణిస్తున్న వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవల్సిన పరిస్థితి తయారైంది. గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోతుండడంతో కాళేశ్వరం వెల్లే భక్తులు, సమీప గ్రామాల ప్రజలు కాలినడకన గమ్యం చేరుకోవల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అసలే ఎండా కాలం కావడంతో మార్గ మధ్యలో అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో నీళ్లు కూడా దొరకక ఇక్కట్లు పడుతున్నారు సామాన్యులు. దశాబ్దాల క్రితం వనాల నడుమ కాలి నడకన వెల్లి తమ గ్రామాలకు చేరుకుంటే ఇప్పుడు వాహనాల రద్దీతో కాలినడకన గమ్యం చేరుకోవల్సిన పరిస్థితి తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్కింగ్ ప్లేసులేవి..?

రీచుల నుండి ఇసుక రవాణా చేసే లారీల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాల్స ఉంటుంది. కానీ TGMDC మాత్రం ఆ దిశగా చొరవ తీసుకోకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రీచుల వద్ద లోడింగ్ కోసం లారీలన్ని కూడా నేషనల్ హైవే పక్కనే పార్కింగ్ చేసి ఉంచుతున్నారు. దీంతో ఎక్కువ సంఖ్యలో వాహనాలు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల మైనింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి రీచుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి రీచువద్ద కూడా పార్కింగ్ స్థలాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. దీంతో ఇసుక లారీలన్ని నేషనల్ హైవేపైనే నిలిపి ఉంచుతున్నారు. వాస్తవంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు వాహనాలను రోడ్ల పక్కన పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలు ఏర్పాటు చేస్తారు. చాలా దూరం వాహనాల్లో ప్రయాణించే వారు సేద తీరేందుకు, వాహనాలు చెడిపోయినప్పుడు ఈ స్థలాలను వాడుకోవల్సి ఉంటుంది. కానీ ఈ నేషనల్ హైవేపై మాత్రం ఇష్టారీతిన ఇసుక లారీలను పార్కింగ్ చేసి రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్నారు. ఇసుక లారీలన్ని హైవేపై నిలుపుతున్న తీరుపై నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం ప్రాంతానికి వెల్లే భక్తులతో పాటు సమీప గ్రామాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదాయంపై దృష్టి సారిస్తోంది కానీ ఇందుకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో మాత్రం విఫలం అవుతోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అధికారులు ఇసుక లారీల పార్కింగ్ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

You cannot copy content of this page