జాతీయ భద్రతా సంస్థ నివేదిక
దిశ దశ, ఏపీ బ్యూరో:
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర హోం శాఖకు నేషనల్ సెక్యూరిటీ వింగ్ ప్రత్యేకంగా నివేదిక పంపించడం సంచలనంగా మారింది. చంద్రబాబు నాయుడు భద్రతలను పర్యవేక్షిస్తున్న ఎన్ఎస్ జి సెక్యూరిటీ టీమ్ ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపించినట్టుగా సమాచారం. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్ర బాబు నాయుడును నంద్యాల నుండి విజయవాడ సిట్ కార్యాలయానికి అక్కడి నుండి హస్పిటల్ కు, తిరిగి సిట్ ఆఫీస్ కు, అక్కడి నుండి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఆ తరువాత సిట్ కార్యాలయం నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సందర్భంగా జరిగిన పరిణామాలపై పూర్తి నివేదికను ఎన్ఎస్ జి నివేదిక కేంద్ర హోం శాఖకు పంపించినట్టుగా సమాచారం. 10వ తేదిన కోర్టులో విచారణ సందర్భంగా భద్రతా పరంగా పటిష్టత లేకపోవడం, కోర్టు హాలు బయట కూడా సెక్యూరిటీ లేకుండా ఉంచారని కూడా ఆ నివేదికలో వివరించినట్టు సమాచారం. అలాగే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోకి వెల్లే సమయంలో కొన్ని భద్రతా లోపాలు ఉన్నాయని, అలాగే జైల్లో కూడా ఆయన భద్రత విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం నివేదిక అంతా కూడా కేంద్ర హోంశాఖకు చేరడంతో ఢిల్లీ స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది.