పార్టీలను వెంటాడుతున్న ప్రకృతి… లోకసభ ఎన్నికల ప్రచారానికి ఇబ్బంది

దిశ దశ, కరీంనగర్:

లోకసభ ఎన్నికల్లో తమ ప్రచారాన్ని ఉధృతం చేసే దిశగా సాగుతున్న పొలిటికల్ పార్టీలకు ప్రక‌ృతి వెంటాడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు వీఐపీల టూర్లతో షెడ్యూల్ తయారు చేసుకుని… జన సమీకరణలో బిజీబిజీగా గడుపుతున్న ఆయా పార్టీల నాయకులకు ప్రకృతి సహకరించడం లేదు. పగటి పూట ప్రచారానికి మండుతున్న ఎండలు భయపెడుతుండగా, ఒక్క సారిగా వాతావరణం మారడంతో అకాల వర్షం కూడా వారిని ఇబ్బందుల పాలు చేస్తోంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించాల్సిన వీఐపీల ప్రచార సభలు రద్దు కావడమో లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవల్సిన పరిస్థితి తయారైంది.

ఎండలతో…

మండుతున్న ఎండల కారణంగా రాజకీయ పార్టీల నాయకులు పట్ట పగలు ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఏప్రిల్ నెలలోనే ఎండల ప్రభావం 103 ఏళ్ల ఆల్ టైం రికార్డ్ ను బ్రేక్ అయింది. ఏప్రిల్ నెలలో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవడం వందేళ్లల్లో ఇదే తొలిసారి కావడంతో లోకసభ ఎన్నికల ప్రచారం ఉదయం, సాయంత్రం చేస్తున్నారు. ఆయా పార్టీల నాయకులు 11 గంటల్లోగానే ప్రచారాన్ని ముగించుకుంటుని, సాయంత్రం 5 గంటల తరువాత తిరిగి నిర్వహిస్తున్నారు.

కరీంనగర్ సీఎం టూర్…

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు సీఎం హాజరై వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం కరీంనగర్ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుండి భారీగా జనసమీకరణ కూడా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు వరుణుని రూపంలో ఆటంకం ఏర్పడింది. మద్యాహ్నం 3.30 గంటల నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోగా, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన టెంట్లు, షామియానాలు కుప్పకూలిపోయాయి. ప్రతికూల వాతావరణంలో సీఎం వరంగల్, కరీంనగర్ సభలకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. హెలిక్యాప్టర్ లో ప్రయాణించే పరిస్థితి లేకపోవడంతో రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం గుండా వరంగల్ కు వెల్లి అక్కడ రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో నిర్వహించాల్సిన జన జాతర సభను రద్దు చేసుకున్నారు.

మంథనిలో…

పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ విజయం కోసం రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పర్యటన ఖరారైంది. అయితే రాజప్థాన్ సీఎం మంథనిలో క్యాంపెయిన్ నిర్వహించేందుకు ఆలస్యంగా చేరుకున్నారు. ఒక్కసారిగా ఈదురు గాలులు, వర్షం అందుకోవడంతో సభావేదిక వద్దకు వచ్చిన జనం అంతా సభాస్థలి నుండి వెల్లిపోయారు. సీఎం టూర్ నేపథ్యంలో భారీగా జనసమీకరణ చేపట్టినప్పటికీ చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించకపోవడంతో బీజేపీ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. వేదిక ప్రాంతంలో ఏర్పాటు చేసిన కుర్చీలు, టెంట్లు చెల్లాచెదురు కావడంతో సభ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సీఎం భజన్ లాల్ శర్మ సభా స్థలి వద్దకు చేరుకుని ప్రచార రథంపై నుండి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

You cannot copy content of this page