చెడగొట్టు వాన…

ఈదురు గాలులు,, వడగండ్లు

కుదేలైన రైతన్న

దిశ దశ, కరీంనగర్:

మళ్లీ ప్రకృతి ప్రళయం సృష్టించింది. ఒక్కసారిగా ఈదురు గాలులు, వడగండ్లు పడి రైతాంగాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాయి. ఇప్పటికే కురిసిన వడగండ్లతో తమకు కడగండ్లే మిగిలాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతన్న నెత్తిన మరోసారి పిడుగు వేసింది ప్రకృతి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనజీవనం అతలాకుతలమైపోయింది. పెద్దపల్లి జిల్లాలో పిడుగుపాటుకు ఒకరు మృత్యువాత పడగా, ఉమ్మడి జిల్లాల్లో వడగండ్ల వాన సృష్టించిన బీభత్సం అంతా ఇంతాకాదు. మొన్నటికి మొన్న కురిసిన వర్షంతో వరిపంట నేలకొరగగా ఎండ తీవ్రంగా కొడితే కొద్దో గొప్పో వడ్లు చేతికి వస్తాయని ఆశించిన రైతులను వెంటాడినట్టుగానే ఆదివారం మద్యాహ్నం కురిసిన వాన అతలాకుతలం చేసింది. దీంతో నేలకొరిన పొలాల్లోకి వర్షపు నీరు చేరడంతో వరి మురిగిపోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరో వైపున అమ్మకం కోసం తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాల్లోకి చేరకుండా వర్షపు నీరుతో కొట్టుకపోతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వాన నీటి బారిన పడకుండా ఉండేందుకు రైతులు పడ్డ కష్టం అంతా ఇంతకాదు. ఈదురు గాలులు కూడా విజృంభించడంతో దిక్కులు పిక్కటిల్లేలా రైతన్న ఏడ్వడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. అలాగే దుర్శేడు గ్రామంలో ఈదురు గాలుల బీభత్సానికి ఇండ్లపై ఉన్న రేకులు కూడా కొట్టుకపోయాయి. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు గ్రామానికి చెందిన అనవేనా మల్లయ్య, తన్నీరు బాలులతో పాటు మరికొంది ఇండ్లపై కప్పులు ఈదురు గాలులకు కొట్టకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఇండ్లలోని సామాన్లు అన్ని కూడా వర్షపు నీటికి తడిచిపోవడంతో తినడానికి తిండి గింజలు కూడా లేకుండా పోయాయని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మండలంలోని ఇరుకుల్లతో పాటు పలు గ్రామాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే రాజీవ్ రహదారిపై కూడా ఈదురు గాలులకు వేళ్లతో సహా చెట్లు ఎగిరి పడడంతో వాహనాల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

దుర్శేడు గ్రామంలో ఈదురు గాలులకు కొట్టుకపోయిన ఇంటి పై కప్పులు
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఇలా
రాజీవ్ రహదారిపై విరిగి పడ్డ చెట్లు

You cannot copy content of this page