ఇద్దరు జవాన్లకు గాయాలు
దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లో మావోయిస్టులు బలగాలపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు జవాన్ల వద్ద ఉన్న రెండు ఆయుధాలను కూడా ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి. సుక్మా జిల్లాలో జాగరగుండ వీక్లీ మార్కెట్ లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లపై మాటు వేసిన మావోయిస్టు పార్టీ నక్సల్స్ కత్తులతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. వార సంతలో బందోబస్తు చర్యల్లో నిమగ్నమైన జవాన్ల కదలికలను పసిగట్టిన నక్సల్స్ పక్కా పథకం ప్రకారం కత్తులతో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో కరాటం దేవా, సోది కన్న అనే ఇద్దరు జవాన్లు గాయల పాలయ్యారు. వీరి వద్ద ఉన్న రెండు ఆయుధాలను కూడా మావోయిస్టులు ఎత్తుకెళ్లారని జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. నక్సల్స్ దాడిలో గాయపడ్డ జవాన్లకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ ద్వారా తరలించేందుకు జిల్లా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది. జాగరగుండ వీక్లీ మార్కెట్ లో దాడికి పాల్పడిన నక్సల్స్ కోసం బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇది యాక్షన్ టీమ్ పనే అయి ఉంటుందని భావిస్తున్న అధికారులు వారిని గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు.