పూసుగుప్ప బేస్ క్యాంపుపై దాడి
దిశ దశ, దండకారణ్యం:
బస్తర్ పూర్వ జిల్లాలోని కీకారణ్యంలో మావోయిస్టుల షెల్టర్ జోన్ ల కోసం బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తుంటే… సరిహద్దుల్లోని బేసే క్యాంపుపై మావోయిస్టులు దాడికి విఫల యత్నం చేశారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోకి మావోయిస్టులు చొరబడే అవకాశాలు లేవని అంచనాతో ఉన్న బలగాలను ఈ ఘటన ఉలిక్కిపడేలా చేసింది. సరిహద్దు ప్రాంతాలను మావోయిస్టులు షెల్టర్ జోన్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారని నిఘా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణాకు చెందిన గ్రే హౌండ్స్, టీజీపీఎస్, సివిల్ పోలీసులు సరిహద్దుల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పటికీ మావోయిస్టులు అనూహ్యంగా పోలీసు క్యాంపుపై దాడి చేయడం సంచలనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప బేస్ క్యాంప్ పై మావోయిస్టులు బుధవారం రాత్రి దాడి చేశారు. అయితే క్యాంపులో ఉన్న పోలీసులు కూడా ఎదురుదాడికి దిగడంతో నక్సల్స్ వెనక్కితగ్గారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న కారణంతో తెలంగాణకు చెందిన బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ తీరని నష్టాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. డికెలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టల డెన్ లపై పారా మిలటరీ బలగాలు చొచ్చుకపోతున్నాయి. ప్రతి 5 కిలో మీటర్లకో బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెల్తున్న పారామిలటరీ బలగాలు మావోయిస్టుల షెల్టర్ జోన్ లను పసిగడుతూ ఏరివేతలో పాల్గొంటున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పార్టీ షెల్టర్ తీసుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దీంతో గత కొంతకాలంగా భద్రాద్రి, ములుగు జిల్లాలను ఆనుకుని ఉన్న పొరుగు రాష్ట్ర అటవీ ప్రాంతంలో మావోయిస్టులు డెన్ లను ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే దళాలను, యాక్షన్ టీమ్స్ ను, లోకల్ గెరిల్లా స్క్వాడ్స్ ను ఏర్పాటు చేసుకున్నప్పటికీ భద్రాద్రి జిల్లా పోలీసుల అప్రమత్తతో మావోయిస్టుల చర్యలకు ఆదిలోనే చెక్ పడుతోంది. అయితే బుధవారం రాత్రి చర్ల మండలం పుసుగుప్ప పోలీస్ బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడికి విఫల యత్నం చేయడం సంచలనంగా మారింది. ఇంతకాలం పోలీసులే నక్సల్స్ కార్యకలాపాలను నిలువరిస్తూ పైచేయిగా నిలుస్తుంటే తాజా ఘటనతో మావోయిస్టుల పట్టు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
BGLతో దాడి…
పూసుగుప్ప బేస్ క్యాంప్ పై మావోయిస్టులు బ్యారెల్ గ్రైనేడ్ లాంఛర్ (BGL)లతో దాడి చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 2018 ప్రాంతంలో మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ తాలుకా పరిధిలోని గుట్టల్లో ఉన్న మావోయిస్టులపై పోలీసులు వీటిని ఉపయోగించి దాడులకు పూనుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. అప్పుడు సుమారు 50 మంది వరకు నక్సల్స్ హతం కావడంతో ఇంద్రావతి నదిలో శవాలు తేలాయి. మావోయిస్టులు మాత్రం అంతగా వీటిని ఉపయోగించిన సందర్బాలు లేవు. మందుపాతరలు, క్లైమెర్ మైన్స్ పేల్చడం, ఏకె 47, ఎస్ఎల్ఆర్ వంటి ఆయుధాలను ఉపయోగించిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. కానీ బీజీఎల్ లాంఛర్స్ ఉపయోగించిన ఘటనలు మాత్రం తక్కువేనని చెప్పాలి. బలగాలే ఆత్యాధునిక ఆయుధాలు వినియోగిస్తుండడంతో మావోయిస్టుల ఉనికికే సవాల్ విసురుతున్న పరిస్థితి తయారైంది దండకారణ్యంలో. 2012 ప్రాంతంలోనే మావోయిస్టులు హెలిక్యాప్టర్లపై దాడులు చేసేందుకు రెక్కీ నిర్వహించుకుని సమాయాత్తం అయినప్పటికీ దాడులు మాత్రం చేయలేదు. హెలిక్యాప్టర్లపై దాడులు చేసేందుకు నిర్వహించిన రెక్కికి సంబంధించిన వీడియోలు కూడా పోలీసుల చేతికి చిక్కాయి. అయితే బస్తర్ అటవీ ప్రాంతంలో మాత్రం డ్రోన్ల ద్వారా పోలీసులు వైమానిక దాడులకు పూనుకుంటున్నారని, వాటిని తాము పేల్చివేశామని మావోయిస్టు పార్టీ బస్తర్ జోనల్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. కానీ ఇటీవల కాలంలో మాత్రం బీజీఎల్ వంటి ఆధునిక ఆయుధాలను ఉపయోగించి దాడులకు పాల్పడిన సందర్బాలు మాత్రం అంతగా లేవు. తాజాగా చర్ల మండలం పూసుగుప్ప వద్ద మావోయిస్టులు బీజీఎల్ వినియోగించి బేస్ క్యాంపుపై దాడులకు పూనుకోవడం చర్చకు దారి తీస్తోంది.